హైదరాబాద్: కేసీఆర్‌పై ఆంధ్రజ్యోతి, వేమూరి రాధాకృష్ణపై నమస్తే తెలంగాణ – పరస్పర ఆరోపణల పర్వం ఇవాళకూడా కొనసాగింది. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చోటుచేసుకున్న వేలకోట్ల రూపాయల తాజ్ కారిడార్ కుంభకోణంలో, కార్మిక శాఖలో డైరెక్టర్‌గా పనిచేసే ఆమె సోదరుడు సిద్దార్థ కుమార్ కూడా నిందితుడేనని, ఆయనకు నిబంధనలకు విరుద్ధంగా కేసీఆర్ సాయం చేశారని ఆరోపిస్తూ, ‘ఏం మాయ చేశారో!?’ అనే హెడ్డింగ్‌తో ఆంధ్రజ్యోతి ఇవాళ బ్యానర్ స్టోరీ ఇచ్చింది. ఈ కుంభకోణంపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ సిద్దార్థ కుమార్ ఇంటితో సహా పలుచోట్ల సోదాలు నిర్వహించిందని ఆ కథనంలో పేర్కొన్నారు. కేసు దర్యాప్తు ప్రారంభమవటంతోనే సిద్దార్థ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్)కు దరఖాస్తు చేసుకున్నారని, అయితే ఆయన పై అధికారులు కేసు దర్యాప్తులో ఉన్న కారణంగా వీఆర్ఎస్ ఇవ్వకూడదని తెలిపారని రాశారు. కానీ కేసీఆర్ కార్మికమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత సిద్దార్థకు వీఆర్ఎస్ ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి చేసి ఇప్పించారని కథనంలో ఆరోపించారు.
మరోవైపు నమస్తే తెలంగాణ పత్రికకూడా ఆంధ్రజ్యోతిపై, ఎండీ రాధాకృష్ణపై బ్యానర్ స్టోరీ ఇచ్చింది. తలలు అతుక్కుని పుట్టిన సయామీ కవల బాలికలు వీణ-వాణిల కుటుంబానికి సాయం చేయటంకోసం 2012లో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఛానల్ ఒక ప్రత్యేక లైవ్ కార్యక్రమం నిర్వహించి వీక్షకులనుంచి విరాళాలు సేకరించిందని, ఆ విరాళాలను ఇంతవరకు ఆ కుటుంబానికి ఇవ్వలేదని ఆ కథనంలో ఆరోపించారు. విరాళాల సేకరణకోసం వీణ-వాణిల తండ్రి మురళీగౌడ్ ఎకౌంట్ నంబర్ కాకుండా ఆంధ్రజ్యోతి ఎకౌంట్ నంబర్ ఇచ్చారని, లక్షల రూపాయలు వచ్చినాకూడా అప్పటినుంచి ఇప్పటివరకు విరాళాలుగా వచ్చిన డబ్బును ఆ కుటుంబానికి ఇవ్వలేదని పేర్కొన్నారు. మురళీగౌడ్ పోన్ చేసి అడిగితే ఒక్క పైసా ఇవ్వబోమని రాధాకృష్ణ బెదిరించినట్లు కథనంలో రాశారు. నవ్యాంధ్ర రాజధాని కోసమని, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కోసమని విరాళాలు సేకరించి వాటిని సొంతానికి వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ కథనానికి ‘యూ డొనేట్… వియ్ డిసైడ్’ అనే శీర్షికకూడా పెట్టారు(‘వియ్ రిపోర్ట్ – యూ డిసైడ్’ అనేది ఏబీఎన్ ఛానల్ ట్యాగ్ లైన్).
ఇదిలా ఉంటే కేసీఆర్ కార్మికశాఖమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అక్రమాలంటూ ఆంధ్రజ్యోతి వెలువరించిన కథనాలపై ప్రస్తుతం కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్న బీజేపీ నేత బండారు దత్తాత్రేయ స్పందనను రెండు పత్రికలూ పూర్తి భిన్నంగా ఇవ్వటం విశేషం. కేసీఆర్ అక్రమాలను పరిశీలిస్తామని దత్తాత్రేయ అన్నట్లు ఆంధ్రజ్యోతి పేర్కొనగా, కేసీఆర్‌పై ఆరోపణలు తన దృష్టికి రాలేదని అన్నట్లు నమస్తే తెలంగాణ పేర్కొంది. ఏది ఏమైనా ఈ రెండు పత్రికలు చేసుకుంటున్న ఆరోపణలపై ఏదైనా మూడో మీడియా సంస్థ పరిశోధన చేసి నిజాలు బయటపెడితా బాగుండు. అప్పటిదాకా వీరిద్దరి కథనాలలో ఏది నమ్మాలో ఎవరికీ ఆర్థం కావటంలేదు. అయితే ఇవాళ నమస్తే తెలంగాణ తన భాషను కొద్దిగా సంస్కరించుకోవటం విశేషం. నిన్నటి కథనంలో ఆంధ్రజ్యోతిపై, రాధాకృష్ణపై దారుణమైన భాషను ప్రయోగించిన నమస్తే తెలంగాణ, ఇవాళ నాగరిక భాషలోనే విమర్శించింది.