తెలుగువారి తొలి ప్రముఖ పత్రికగా పేరొందిన ఆంధ్ర పత్రికను ఎన్డిఎ ఉపాద్యక్ష అభ్యర్థి వెంకయ్య నాయుడు పున: ప్రారంభించారు. మూతపడిన పత్రిక పున: ప్రారంభమై ఆ స్థాయిలో నడవడం ఒక్క ఆంధ్రజ్యోతి విషయంలో ఆర్కే మాత్రమే సాధించిన విజయం. గత యజమాని శివలెంక రాధాకృష్ణ నుంచి పత్రిక ప్రచురణకు అనుమతి సంపాదించేందుకు వెంకయ్య సహకరించారట. పూర్వ ఈనాడు పాత్రికేయుడు, ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీల యజమాని అయిన కంచర్ల రామయ్య సహకారంతో ఆయన పూర్వ సహచరుడైన పాంచజన్య సంపాదకుడుగా మళ్లీ ప్రారంభించారు. పాంచజన్య మహానగర్ పత్రిక సంపాదకుడుగా పరిచితులు. రామయ్యను గౌరవ సంపాదకుడని సంబోధిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్ర పత్రిక ప్రారంభ సంచిక చూస్తే గతంలో నడిచిన దానికి ఇప్పుడు మళ్లీ మొదలు పెట్టిన దానికి మధ్యన చాలా తేడాలున్నాయి. నిజానికి మరో పాత పత్రిక కృష్ణాపత్రికను కూడా పూర్వ బిజెపి నాయకుడైన కీ.శే. పిరాట్ల వెంకటేశ్వర్లు గతంలో పున: ప్రారంభించి పరిమితంగా నడుపుతూ వచ్చారు. పాత ఆంధ్ర పత్రిక ప్రతినిధిగా విజయవాడకు సుపరిచితులైన సీనియర్ జర్నలిస్టు శాస్త్రిగారు( టీవీ9 మురళీ కృష్ణ తండ్రి) పిరాట్లకు సహకరిస్తుండేవారు. తర్వాత దాన్ని తెలంగాణకు చెందిన ఒక యువ పాత్రికేయుడు తీసుకున్నారు. తాజా పరిస్థితి తెలియదు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మరో పత్రిక అగ్రస్థానానికి చేరడం మాత్రం సులభం కాదన్నది స్పష్టం.పాంచజన్యకు స్థానిక పత్రికలు దీర్ఘకాలంగా నడుపుతున్న అనుభవం వుంది. మరి ఇప్పుడు పత్రిక ఎలా వుంటుందో చూడాలి.