ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల్లో సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. మెట్రో సిటీలు ఉన్న నగరాలను తలదన్నేలా పాజిటివ్ కేసులను నమోదు చేస్తోంది. గత ఇరవై నాలుగు గంటల్లో ఏకంగా 5041 పాజిటివ్ కేసులు నమోదయినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. 54 మంది చనిపోయారు. మొత్తం 31148 శాంపిల్స్ పరీక్షించినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అన్ని జిల్లాల్లోనూ వందల్లో కేసులు నమోదవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 647 కేసులు నమోదు కాగా.. అనంతపురంలో ఈ సంఖ్య 637గా తేలింది. శ్రీకాకుళంలో 535, చిత్తూరులో 440 కేసులు నమోదయ్యాయి. అతి తక్కువగా ప్రకాశం జిల్లాలో మాత్రమే ఒక్క రోజులో 150 కేసులు రికార్డయ్యాయి. ఇప్పటి వరకూ ఏపీలో కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 642గా లెక్క తేల్చారు.
ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లోనూ కరోనా వ్యాప్తి ఒకేలా ఉంది. అంటే.. దాదాపుగా సామాజిక వ్యాప్తి దశకు చేరుకుందన్న అభిప్రాయం.. వైద్య నిపుణుల్లో వ్యక్తమవుతోంది. కోవిడ్ ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీగా ఉండటం లేదు.. ప్రైవేటు ఆస్పత్రుల్లో.. వైద్య చికిత్స అందించడానికి సౌకర్యాలు ఉండటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో.. కేసులు అత్యధికంగా పెరిగిపోతూండం.. మరణాలు కూడా అదే స్థాయిలో ఉండటంతో.. అధికారవర్గాల్లో సైతం ఆందోళన పెరుగుతోంది. కొన్ని కొన్ని చోట్ల ప్రజలు స్వచ్చంద లాక్ డౌన్ పాటిస్తున్నారు. మరికొన్ని చోట్ల .. అధికారులే కర్ప్యూ విధిస్తున్నారు. ఏం చేసినా.. మద్యం దుకాణాల్లాంటి వాటికి మాత్రం.. అడ్డూ అదుపూ లేకపోవడంతో.. పరిస్థితి దారుణంగా మారుతోంది.
పరిస్థితి చేయి దాటుతుందని అనుకున్నారేమో కానీ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ… ఏపీ సీఎం జగన్ కు ఫోన్ చేశారు. కరోనా తీవ్రత, కట్టడిని చేపడుతున్న నివారణ చర్యలు, పరీక్షల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు.వైరస్ను నివారించుటకు పలు సూచనలు, సలహాలు సైతం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం.. రాబోయే రోజుల్లో కరోనా రాని వారంటూ ఎవరూ ఉండరన్న అభిప్రాయంతో.. ప్రజల ప్రాణాలను లైట్ తీసుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు ప్రస్తుతం తీసుకోవడం లేదు. లాక్ డౌన్ పేరుతో.. కొన్ని చోట్ల కట్టడి చేస్తున్నప్పటికీ ఉపయోగడం ఉండటం లేదు. ప్రమాదకరణంగా మరణాలు ఉంటూండటంతో.. కరోనా బారిన పడిన వారిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసులో 26118 ఉన్నాయి.