“Bad governments always lie because telling the truth requires honour and courage!” . ” ఓ చెడ్డ ప్రభుత్వం ఎప్పుడూ అబద్దాలే చెబుతుంది. ఎందుకంటే నిజం చెప్పడానికి ధైర్యంతో పాటు గౌరవం కూడా ఉండాలి ” మెహమట్ మురాన్ ఇల్డాన్ అనే ఓ టర్కీష్ రచయిత చెప్పిన మాటలు ఇవి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు… పాలన నడుపుతున్న వైనం చూస్తే.. వంద శాతం ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించే ఈ టర్కీష్ రచయిత చెప్పారని మనకు అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విషయంలోనూ ఎప్పుడూ నిజం చెప్పలేదు. నిజాలు దాచుకోవడానికి .. అబద్దాలు ప్రచారం చేయడానికి చివరికి జీవోలనూ కూడా దాచేసింది. రాష్ట్ర భవిష్యత్‌కు అత్యంత కీలకమైన రాజధాని విషయంలో మూడున్నరేళ్లుగా ఇవే అబద్దాలు చెబుతోంది. ఇప్పుడు బరి తెగించి పోయారు. ఇంట ఓ మాట.. బయట ఓ మాట చెబుతున్నారు. అదేమిటంటే.. పెట్టుబడిదారుల్ని ఆకర్షించడానికి ఎన్నైనా చెబుతామనే బరితెగింపు వాదన వినిపిస్తున్నారు. ఓట్లు వేయించుకోవడానికి అంత కంటే ఎక్కువే చెప్పి ఏపీ ప్రజల్ని మోసం చేసినట్లుగా.. ఇలా పెట్టుబడిదారుల్ని కూడా సులువుగా మోసం చేయవచ్చని ప్రభుత్వం అనుకుంటోంది. ఇంత కన్నా ఓ రాజకీయ పార్టీ విశ్వసనీయతలో దిగజారిపోతుందా ?
మూడు రాజధానులంటే పెట్టుబడులు రావని నాలుగేళ్లకు తెలిసిందా?
రాజధాని అన్నది ఏ రాష్ట్రానికైనా ఓ చిరునామా. గ్రోత్ ఇంజన్.. విభజన తర్వాత ఏపీకి అది ఇంకా ముఖ్యమైంది. అలాంటి రాష్ట్రానికి అమరావతి అని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి ప్రభుత్వాధినేత కూడా అప్పుడు మద్దతిచ్చారు. ఎన్నికల వరకూ అమరావతే రాజధాని అన్నారు. ఎలక్షన్ తర్వాత “విధానాలు” మారిపోయాయి. అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా మూడు రాజధానుల అంశం ముందుకొచ్చింది. ఇప్పటివరకూ అమరావతి లో ఉంటున్న పరిపాలనా రాజధాని విశాఖకు… ఇక్కడే ఉన్న హైకోర్టును కర్నూలుకు.. అసెంబ్లీని అమరావతికీ అని చెప్పారు. ఇప్పటికి నాలుగేళ్లయింది. ఒక్క అడుగు ముందుకు పడలేదు. కానీ ప్రపంచం మొత్తం చర్చించుకునేలా చేశారు. అసెంబ్లీలో బిల్లు వెనక్కి తీసుకున్నా.. . మూడు రాజధానుల విధానం నుంచి వెనక్కు మళ్లలేదు అని ప్రభుత్వం అనేక సందర్భాల్లోనూ అసెంబ్లీలోనూ ప్రకటించింది. కాబట్టి బిల్లులో పెట్టినట్లుగా సుప్రీంకోర్టు ఒప్పుకుంటే మూడు ప్రాంతాలకూ మూడు రాజధానులు వస్తాయన్నది సామాన్య ప్రజలకు ఉన్న అవగాహన. ఇక వైస్సార్సీపీ ఇచ్చిన సంకేతాలను బట్టి కోర్టు తీర్పు అనుకూలంగా రాకపోయినా సరే.. ముఖ్యమంత్రి తన నివాసాన్ని మార్చేసుకుంటారిని ఆయన ఎక్కడుంటే అదే రాజధాని అని కూడా ప్రకటనలు వచ్చాయి. విశాఖకు చెందిన మంత్రి అమరనాథ్ రాజెక్కడ ఉంటే అదే రాజాధాని అని ప్రకటించేశారు కూడా. ఇప్పటికీ అదే చెబుతున్నారు. రాజధాని ఏది అని బయట వారు అడిగితే అమరావతి అని చెప్పడానికి ఈ ప్రభుత్వంలో ఎవరికీ మనస్కరించడం లేదు. అమరావతి అని పేరునే ఉచ్చరించడం లేదు. అలాగే విశాఖ అని ఇప్పటికిప్పుడు చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. ముఖ్యంగా ఇన్వెస్టర్స్ సమ్మిట్ లాంటి సమయంలో అది ఇబ్బందికరమైన పరిస్థితే. మూడు రాజధానులు అంటే పెట్టుబడులు రావని ప్రభుత్వానికి నాలుగేళ్లకు తెలిసి వచ్చింది.అందుకే ఇప్పుడు ఇన్వెస్టర్లను మాయ చేయడానికి విశాఖ ఒక్కటే రాజధాని అనే వాదనను తెరపై కితీసుకు వచ్చారు. ఇక్కడ అసలు బరి తెగింపు ఏమిటంటే… ఇన్వెస్టర్లను మోసం చేస్తున్నామని.. ఏపీలో నేరుగా చెప్పడం. పెట్టుబడుల కోసం ఏమైనా చెబుతామని అడ్డగోలుగా వాదించడం.
అంతా మోసకారి మాటలే.. ఎప్పుడైనా నిజం చెప్పారా ?
అమరావతే రాజధాని కాదు అమరావతి కూడా ఓ రాజధాని అని.. ప్రారంభించి .. కర్ణాటకలో ఓ సెషన్ అసెంబ్లీ బెళగావిలో నిర్వహిస్తారు కదా అలా గుంటూరులో నిర్వహిస్తామని బుగ్గన చెప్పుకొచ్చారు. బెళగావి ప్రాంతం మహారాష్ట్రదనే వివాదం ఉంది. అది కర్ణాటకదని చెప్పుకోవడానికి అక్కడ సమావేశాలు నిర్వహిస్తారు. ఇప్పుడు గుంటూరు ను కూడా అలాంటి వివాద జాబితాలో చేర్చారు ఘనత వహించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అసలు మూడు రాజధానులు అన్న కాన్సెప్టే కొత్త గా ఉంది. మూడు ప్రాంతాల అభివృద్ధి అన్నది సరే కానీ.. మూడు రాజధానులు ఏంటి అన్న ప్రశ్న బయట ఉంది. అలాగే మూడు రాజధానులు అనే పేరుతో కోర్టు కేసుల్లో నెగ్గడం కూడా కష్టంగానే ఉంది. అసలు ఆ నగరాలకు రాజధాని అనే గుర్తింపు ఉంటుందా అన్నది కూడా సందేహమే.. అందుకే క్రమక్రమంగా రాజధానులు అని పేరువైపు నుంచి అక్కడ ముఖ్యమైన ఇనిస్టిట్యూషన్ లు ఇచ్చాం.. జనబాహుళ్యంలో రాజధానిగా గుర్తింపు ఉంటుంది అన్న డైవర్షన్ వైపు జనాలను మళ్లిస్తున్నారు. అమరావతి రాజధానిగా ఈ ప్రభుత్వానికి నచ్చలేదు అన్నది స్పష్టం. అయితే రాజధానిగా మాత్రమే కాదు. మిగతా విషయాల్లోనూ అమరావతిని ప్రమోట్ చేయడం లేదు. పారిశ్రామిక వేత్తల సదస్సులో కూడా అమరావతి అనే ఓ నగర నిర్మాణం జరుగుతోంది అని కానీ.. అక్కడ అభివృద్ధి చేసిన ప్రభుత్వ భూమి వేల ఎకరాల్లో ఉంది అని కానీ మాటమాత్రంగా కూడా చెప్పడం లేదు. అమరావతి రాజధానిగా పనికి రాదు సరే.. ఇతర అవసరాల విషయంలో ఎందుకు ప్రస్తావించడం లేదు. అమరావతి లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలరకు అవకాశం ఉందని ప్రభుత్వమే ఇంతకు ముందుకు ప్రకటించింది. మరి ఇన్వెస్టర్ మీట్ లో అమరావతి ని ఎందుకు ప్రమోట్ చేయడం లేదు.. ఈ ప్రభుత్వం అమరావతిని ఇతర ప్రాంతంగా గుర్తించిందా ? అంటరాని ప్రాంతంగా డిసైడ్ చేసిందా ?
అమరావతిని నాశనం చేసి బాగుపడిందెవరు..?
రాష్ట్రం మధ్యలో ఉంటుందని.. గుంటూరు- విజయవాడ మధ్య నగరాన్ని కడితే.. రెండు నగరాలు కలిసి… పొరుగు రాష్ట్రాలకు ధీటుగా ఓ మహానగరం అభివృద్ధి చెందుతుందని… ఆంధ్ర భావి పౌరులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని అందర్నీ కన్విన్స్ చేసి గత ప్రభుత్వం అమరావతిని ఎంపిక చేసింది. స్వయంగా ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్ రెడ్డి ఏకంగా అసెంబ్లీలోనే సమర్థించారు. అదేమీ రాజకీయ ప్రకటన కాదు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వర్గాల ఆమోదంతోనే… అప్పటి ప్రభుత్వం అమరావతిని నిర్ణయించింది. ఏ ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు. అందుకే.. అమరావతి కోసం రైతులు కూడా భూములివ్వడానికి ధైర్యంగా ముందుకొచ్చారు. ఎన్నికల్లో అమరావతి మార్పు అనే అంశం రాజకీయ తెరపైకి వచ్చినప్పుడు అందరూ ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ వైపే అనుమానంగా చూశారు. ఆ పార్టీనే సందేహాస్పదంగా ప్రశ్నించారు. అయితే వారిచ్చిన సమాధానం ఒక్కటే రాజధాని అమరావతిలోనే ఉంటుంది… చంద్రబాబు అరకొరగా కడుతున్నారు.. తాము వచ్చి కట్టి చూపిస్తామన్నదే ఆ సమాధానం. దాంతో ఎవరికైనా రాజధాని కట్టడమే సమస్య అవుతుంది కానీ.. ఎంపిక కాదు. కానీ.. అలా చెప్పిన వాళ్లే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారు. రాజధానిని సమస్యగా చేశారు. ప్రజలు.. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు. లేని సమస్యను సృష్టించారు. ఆ సమస్య మీదుగా రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు ఏపీ నాశనం అయిపోయింది. రాజధాని రైతులు నాశనం అయ్యారు తప్ప.. ఎవరైనా బాగుపడ్డారా..?. విశాఖపట్నం రాజధాని పేరుతో అక్కడ విపరీతంగా పెరిగిపోయిన కొనుగోళ్లను ఇన్ సైడర్ ట్రేడింగ్‌గా పేర్కొని.. తర్వాత వచ్చే ప్రభుత్వం కేసులు పెడితే… ఎవరు అన్యాయమైపోతారు..?. రాజధాని ప్రతిష్టంభన కారణంగా ఏపీకి జరిగిన నష్టాన్ని ఎవరైనా అంచనా వేయగలరా..?. పెట్టుబడుల ప్రతిపాదనల్లేవు. ఎవరైనా ఇన్వెస్టర్ ఏపీ వైపు రావాలంటే.. ఈ గందరగోళ పరిస్థితుల్ని చూసి వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి. కానీ రాజధాని వస్తే చాలు ఏదో జరిగిపోతుందన్న భావన కల్పించి… ఆశలు రేపి.. ప్రచార రాజకీయంతో విధ్వంసం మాత్రం కొనసాగిస్తున్నారు.
వైఎస్ఆర్సీపీకీ అమరావతి కుట్రలు భస్మాసుర హస్తమే !
పోనీ ఇంత చేసిన వైఎస్ఆర్సీపీ ఏమైనా లభపడిందా అంటే… ఆ పార్టీ నేతలు కూడా ఇప్పుడు తాము మూడు ప్రాంతాలకు కాని వాళ్లం అవుతున్నామని ఆందోళన చెందుతున్నారు. వైసీపీ రాజకీయ క్రీడలో దారుణంగా మోసపోయామని అంచనా వేస్తున్నారు. కర్నూలును న్యాయరాజధాని చేస్తున్నామని ప్రభుత్వం ఆశలు రేపింది. ఇప్పుడు కర్నూలులో హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమే ఉంటుందని.. అలా అని రాజధాని అని అనలేమని.. సాక్షాత్తూ కర్నూలుకే చెందిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. ఇటీవలి కాలంలో రాయలసీమకు హైకోర్టు ద్వారా న్యాయం చేస్తామని.. రాజధాని అంటే.. హైదరాబాద్ లా అభివృద్ధి చెందుతుందని చెబుతూ వస్తున్నారు. చివరికి అది తేలిపోయింది. పైగా విశాఖ రాజధాని అంటే.. సీమ వాసులకు తీవ్ర నష్టం జరుగుతుంది. హైదరాబాద్ కన్నా వారికి విశాఖ రెట్టింపు దూరం అవుతుంది. ఈ రాజధానిని వారు అంగీకరించే అవకాశం ఉండదు. అమరావతి రాజధాని కావాలని కోస్తా ప్రజలు ఉద్యమాలు చేయలేదు. ఆ మాటకు వస్తే.. ఎక్కడ రాజధాని చేయాలన్న చర్చ వచ్చినప్పుడు.. మా ప్రాంతానికే రాజధాని కావాలని ఎక్కడా ఉద్యమాలు జరగలేదు. ప్రభుత్వం రాష్ట్రానికి మధ్యలో ఉంటుందని గుంటూరు, విజయవాడ మధ్య ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని ధింక్ బిగ్ అన్నట్లుగా రాజధాని నిర్మాణానికి ప్రయత్నించింది. అప్పట్లో ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. కానీ ఇప్పుడు కోస్తా ప్రజలకే అన్నీ ఇస్తున్నారన్నట్లుగా రాజకీయ పార్టీలు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ విమర్శలు చేసి.. ఆ ప్రాంతంపై కనిపించని వ్యతిరేకత కనబరుస్తూంటే.. ప్రజల్లో అసంతృప్తి లేకుండా ఉంటుందా? ఉద్యమం రూపంలో బయటకు రాకపోవచ్చు ఓట్ల రూపంలో సునామీలాగా విరుచుకుపడే అవకాశం ఉందని రాజకీయ పార్టీలు అంచనా వేయలేకపోతే అది వారి తప్పిదమే. విశాఖ ప్రజలు రాజధాని అడగలేదు.కానీ ప్రభుత్వం అక్కడ రాజధాని పెడితే ప్రపంచ స్థాయి నగరం అవుతుందని చెబుతున్నారు. కానీ న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. సీఎం స్థానంలో ఉండి.. అలాంటివేమీ పట్టించుకోనని.. తానతు స్వయంగా విశాఖ వచ్చి పాలన చేస్తానని చెబుతున్నారు. దీని వల్ల విశాఖకు రాజధాని వచ్చినా అది చట్టబద్ధం కాదని.. ప్రజాస్వామ్య పాలనలో దీన్ని ఎలా అంగీకరించాలన్న వాదన హజంగానే వినిపిస్తోంది ఓ వైపు ఇన్వెస్టర్లకు ఒకే రాజధాని అని చెబుతూ.. మరో వైపు ప్రజలకు మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని చెప్పడం ద్వారా వైసీపీ రాజకీయ లాభం పొందాలని అనుకుంటుందేమో కానీ.. వ్రతం చెడ్డా ఫలితం దక్కని పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే అటు రాజకీయ లాభం కలగకపోగా.. ఇటు ఇన్వెస్టర్లు కూడా ప్రభుత్వం చెప్పేదొకటి చేసేది ఒకటనే అభిప్రాయానికి వస్తున్నారు.
మంచి లేదు.. చెడూ లేదు.. ఎవరు ఏం చెప్పినా అరుపులేనా ?
అమరావతి అంశంపై అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు మొదటే హెచ్చరించారు. పట్టణీకరణకు ఓ మోడల్ లాంటి అమరావతికి జోలికి రావొద్దని సలహాలిచ్చారు. కానీ అమరావతికి మద్దతుగా మాట్లాడిన వారిపై పార్టీ నేతల్ని ఉసిగొల్పి తిట్టించారు కానీ.. జరుగుతున్న నష్టాన్ని గుర్తించలేదు. ఇప్పటికీ గుర్తించారు కానీ.. వెనక్కి తగ్గడానికి సిద్ధపడటం లేదు. నినాశనానికే సై అంటున్నారు. “If dogs are governing a country, what can you hear every day other than horrible barking noises?” మొదట చెప్పుకున్న టర్కీష్ రచయితే ఇదీ చెప్పారు. దీన్ని కూడా కూడా ప్రస్తుత పరిస్థితితో పోల్చుకుని కాదనగలమా ?