ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రాఫిక్.. క్లియర్ అయిపోయింది. గత నాలుగేళ్లుగా.. గాల్లో చక్కర్లు కొట్టిన విమానాలు ఇప్పుడు.. కనిపించడం లేదు. విజయవాడ విమాశ్రయం.. నాలుగేళ్లలో 93 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఈ పెరుగుదల అసాధారణం. కానీ రెండు నెలలుగా అనూహ్యమైన మార్పులు వచ్చాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందు వివిధ నగరాల నుంచి 54 సర్వీసులు రాకపోకలు సాగించేవి. రెండు నెలల్లోనే వాటి సంఖ్య 28కి పడిపోయింది. అంటే.. 26 సర్వీసుల్ని విమానయాన సంస్థలు నిలిపివేశాయి. 2014కు ముందు విజయవాడ నుంచి కేవలం 10 విమాన సర్వీసులు మాత్రమే ఇక్కడ్నుంచి నడిచేవి. కానీ నవ్యాంధ్రలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాగా పెరిగాయి. 2018 మార్చి నాటికి విజయవాడ నుంచి రోజుకూ 54 సర్వీసులు నడిచేవి. ఇప్పుడు 26 సర్వీసులకే పరిమిమయ్యాయి.
తొలి అంతర్జాతీయ విమాన సర్వీసు కూడా మూణ్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. పేరుకు ఏపీలో మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నా.. విజయవాడ, తిరుపతి ఎయిర్ పోర్ట్ ల నుంచి ఎటువంటి అంతర్జాతీయ విమానాలు నడవడంలేదు. ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నా విమాన సంస్థలు విమాన సర్వీసులు రద్దు చేసుకోవటంపై విమాన ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విమానాల సర్వీసుల రద్దుతో సర్వీసులు తగ్గి, డిమాండ్ పెరగడంతో విమాన చార్జీల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం… విశాఖ నుంచి విజయవాడ వెళ్లాలంటే.. నేరుగా విమాన సౌకర్యం లేదు. ముందుగా.. వయా హైదరాబాద్ మీదుగా.., విజయవాడ చేరుకోవాల్సి ఉంటుంది.
రెండు నెలల్లోనే ఇంత దారుణంగా.. ఎయిర్ ట్రాఫిక్ పడిపోయిందా.. అంటే… అంతా ప్రభుత్వ నిర్ణయాలు స్వయంకృతమేనని చెప్పుకోవాలి. అటు కేంద్రం.. ఇటు రాష్ట్రం రెండింటి నిర్ణయాలు విమానాయాన రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అమరావతి నిర్మాణాన్ని నిలిపివేయడంతో… వచ్చే వారు తగ్గిపోయారు. ఇక విమానాయన సంస్థలు సంక్షోభంలో ఉండంతో అవి కూడా భారాన్ని తగ్గించుకోవడానికి… విజయవాడ సర్వీసులపైనే దృష్టి పెట్టాయి. ఫలితంగా.. విజయవాడ విమానాశ్రయం 2014 నాటి పరిస్థితికి దిగజారిపోయింది.