రాజకీయాలపై బాగా అవగాహన ఉన్న వాళ్లకు ఏపీలో ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉంటాయి..? ఎంత మంది మంత్రులు ఉంటారు.. వారు ఏ జిల్లాలకు చెందిన వారు అనేదానిపై స్పష్టత ఉంటుంది. చాలా మందికి వారి శాఖలపైనా స్పష్టత ఉంటుంది. అయితే ఇప్పుటు టక్కున ఏపీలో ఏ శాఖ మంత్రి ఎవరు అంటే.. నూటికి 90 శాతం మంది చెప్పలేరు. రాజకీయాలపై అమతిమైన ప్రేమతో వచ్చిన సమాచారం చదివే వాళ్లకు కూడా తెలియదు. ఎందుకంటే.. ఏ శాఖ మంత్రి ఎప్పుడూ తన శాఖ గురించి మాట్లాడరు.
ఇతర విషయాలపైనే ఎక్కువ మాట్లాడతారు. ఆరోగ్య మంత్రి .. అమరావతి గురించి మాట్లాడరు. పురపాలక మంత్రి ఆర్థిక శాఖ గురించి మాట్లాడతారు. ఆర్థిక మంత్రి అసలు మాట్లాడరు. అయితే అందరి పనులు సకల శాఖల మంత్రి చూస్తారు కాబట్టి.. మిగిలిన వారందరూ ప్రెస్ మీట్లలో మాట్లాడటమే.. అదీ కూడా రాసిచ్చినది మాత్రమే చదవడమే వారి పని అని వైసీపీలో అందరికీ తెలిసిన విషయమే. శాఖలే గుర్తుండవు.. ఇక డిప్యూటీ సీఎంలు ఎవరికి గుర్తుంటారు. అసలు డిప్యూటీ సీఎం అనే పదానికే విలువ లేకుండా చేసేశారు సీఎం జగన్. మొదటి సారి ఏకంగా ఐదుగుర్ని పెట్టారు. ఆహా డిప్యూటీ సీఎంలా.. అని అప్పట్లో కొంత మందిని గుర్తుంచుకున్నారు.
రెండో సారి ఐదుగుర్ని మార్చారు. కానీ ఇప్పుడు ఆ ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఎవరో ఎవరికీ తెలియదు. అసలు ఆ మంత్రులకు కూడా తాము డిప్యూటీ సీఎంలమనే సంగతి గుర్తున్నదనే సంగతి తెలుసా అంటే డౌటే. ఎప్పుడూ వారు తమ శాఖలపై సమీక్లషలు చేయలేదు.. చేసే అవకాశం రాలేదు. కులాల ప్రకారం ప్రాధాన్యం ఇచ్చామనిచెప్పుకోవడానికి వారికి పదవులు ఇచ్చి.. వారిని అలా విగ్రహాలుగా ఉంచేస్తున్నారు. నిజానికి వారికి అలాంటి అవకాశం కూడా లేదు. ఎందుకంటే వారికి పదవి ఉన్న సంగతి ప్రజలకు కూడా పెద్దగా తెలియడం లేదు మరి. ఏపీలోనే ఇలాంటివి స్పెషల్ అనుకోవాలేమో ?