వరదల బారిన పడిన కేరళ రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాలు అండగా నిలిచాయి. తెలంగాణ ప్రభుత్వం… ఉన్న పళంగా రూ. 25 కోట్ల సాయన్ని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ. 10 కోట్ల సాయాన్ని ప్రకటించారు. రెండు రాష్ట్రాలు కేరలకు వస్తు రూపేణా… తమకు సాధ్యమైనంత సాయం చేస్తామని కేరళ ప్రభుత్వానికి హామీ ఇచ్చాయి. పొరుగు రాష్ట్రాల పట్ల తెలుగు రాష్ట్రాలు ఎప్పుడూ ఔదార్యాన్ని చూపుతూనే ఉంటాయి. గతంలో హుదూద్ తుపాన్ వచ్చినప్పుడు కూడా.. తెలంగాణ ప్రభుత్వం… ఏపీకి అన్ని విధాలుగా సాయం అందించింది.
గత వందేళ్లలో ఎన్నడూ లేనంత ప్రకృతి విలయాన్ని కేరళ ఎదుర్కొంటోంది. మృతుల సంఖ్య దాదాపుగా 400కు చేరింది. కేరళలో ఉన్న 80 డ్యాముల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. వరదల కారణంగా.. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం మూసి వేశారు. కర్ణాటక, తమిళనాడుల నుంచి బస్సుల రాకపోకలపై కూడా ప్రభావం పడింది. మెట్రో సర్వీసుల్ని కూడా నిలిపి వేశారు. కనీవినీ ఎరుగనంత నష్టం జరిగిందని.. కేరళ ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సాయం చేసేందుకు అందరూ ముందుకు రావాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ… కేరళకు రూ. 100 కోట్ల సాయం ప్రకటించారు. సహాయ కార్యక్రమాలపై కొచ్చికి చేరుకుని సమీక్ష నిర్వహించారు. నేడు బాధిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తారు. ఆ తర్వాత కేరళకో మరో రూ. 1000 కోట్ల సాయం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కేంద్రం కేరళపై తీవ్ర వివక్ష చూపుతోందన్న విమర్శలు వచ్చాయి. వందేళ్లలో కనీవినీ ఎరుగనంత విపత్తు సంభవిస్తే మరీ వంద కోట్ల సాయం ఏమిటన్న విమర్శలు రావడంతో… ప్రధాని కూడా… మరింత సాయం ప్రకటించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.
కేరళ ప్రజలను ఆదుకోవడానికి అక్కడి సెలబ్రిటీలు చురుకుగా వ్యవహరిస్తున్నారు. స్వయంగా సాయం ప్రకటించడమే కాదు.. ఆ సాయం ప్రజలకు చేరేలా సమన్వయ పాత్ర పోషిస్తున్నారు. ఇతర ప్రముఖులు, విదేశాల్లో స్థిరపడిన కేరళీయులు.. ప్రత్యేకంగా గ్రూపులుగా ఏర్పడి సొంత రాష్ట్రానికి అండగా నిలుస్తున్నారు. స్టాండ్ విత్ కేరళ హ్యాష్ ట్యాగ్ స్ఫూర్తిగా…. అందరూ కేరళ కోసం చేయి చేయి కలుపుతున్నారు.