ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. భారతీయ జనతా పార్టీ మూడు రాష్ట్రాల్లో గెలిచింది. ఈ ఉత్సాహంతో ఒక నెల ముందే ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు ఫిబ్రవరిలోనే ఉండొచ్చని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా చెబుతున్నారు. జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. తోసి పుచ్చలేమని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల కోసం దాదాపుగా పూర్తి చేసింది. రిటర్నింగ్ ఆఫీసర్లను నియామకం దగ్గర్నుంచి ఈవీఎంలను నియోజకవర్గాలకు చేర్చడం వరకూ అన్ని పూర్తయిపోయాయి. పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిషా వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలుకూడా జరగాల్సి ఉంది. వాటికీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఎన్నికల నిర్వహణకు చివరి సన్నాహం అయిన ఓటర్ల జాబితాను అప్ డేట్ చేసే ప్రక్రియ కూడా ఊపందుకుంది. జనవరి 8న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. అంటే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి రెడీగా ఉన్నట్లే.
సాధారణంగా 2019 సార్వత్రిక ఎన్నికలకు మార్చి పదో తేదీన షెడ్యూల్ విడుదల అయింది. మొత్తంగా ఎనిమిది విడతల్లో పోలింగ్ జరిగింది. జూన్ లో కౌంటింగ్ జరిగింది. ఇంత సుదీర్ఘమైన ప్రక్రియపై విమర్శలు వచ్చాయి. అందుకే ఈ సారి ఎన్నికల సంఘం.. నాలుగైదు విడతల్లోనే పూర్తి చేయాలని అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరిలో షెడ్యూల్ రీలీజ్ చేసి .. రెండు నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు ఢిల్లీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.