ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శనివారం ప్రారంభం కాబోతున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. షెడ్యూలు ప్రకారం.. శనివారం గవర్నరు ప్రసంగం తరువాత సభ ముగుస్తుంది. సోమవారం నుంచి మళ్లీ మొదలవుతాయి. మొత్తం 20 అంశాలను సభలో చర్చకుపెట్టి ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తున్నది. 10వ తేదీన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. ఈనెల 30వ తేదీవరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని అంటున్నారు. తాము రూపొందించుకున్న షెడ్యూలు ప్రకారం… తెదేపా ప్రభుత్వం మీద , వీలైతే స్పీకరు మీద కూడా అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నది.
ఇదంతా ఆయా పార్టీలు లేదా ప్రభుత్వం మేరకు ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జరగవలసిన అసెంబ్లీ సమావేశాల వ్యవహారం. కానీ.. మన అసెంబ్లీ ఎలా జరుగుతుందో అందరికీ తెలిసిన సంగతే కదా! మొన్నటికి మొన్న శీతాకాల సమావేశాలు ఎలా జరిగాయో అందరూ చూశారు కదా! అంతకు మించి ఏమాత్రం ఈ సమావేశాలు కూడా భిన్నంగా జరిగే అవకాశం లేదు.
ఇవాళ గవర్నరు ప్రసంగం మాత్రం సాఫీగా జరిగిపోయే అవకాశం ఉంది. మామూలుగా అయితే.. ప్రభుత్వ పథకాల గురించి గవర్నరు ప్రకటించడానికి పూనుకుంటే.. గవర్నరు ప్రసంగాన్ని అడ్డుకోవడానికి కూడా.. విపక్షాలు సాధారణంగా ప్రయత్నిస్తుంటాయి. కానీ.. ప్రత్యేకించి గవర్నరు నరసింహన్ విషయంలో జగన్ అనుసరించే వైఖరిని బట్టి, తన సమస్యలను ప్రతి సందర్భంలోనూ గవర్నరుకు నివేదించుకునే క్రమంలో జగన్ కొనసాగించే బాంధవ్యాలను బట్టి.. ఆయన పార్టీ గవర్నరు ప్రసంగాన్ని అడ్డుకునే అవకాశం ఎంతమాత్రమూ లేదనే అనిపిస్తోంది. గవర్నరు ప్రసంగం అడ్డుకోవడమూ, కాగితాలు చించడమూ వంటి దుడుకు చర్యలు లేకుండానే సాగుతుంది.
కానీ సోమవారం నుంచే అసలైన రగడలు మొదలవుతాయి. సభలో ఏం మాట్లాడుకుంటున్నారో ఎవరేం అరుస్తున్నారో ఒక్క ముక్క కూడా మనకు వినిపించే అవకాశం ఉండదు. వినిపించదు. ఎవరికి వారు గోల గోలగా అరుస్తూ ఉంటారు. ఇలా నాలుగురోజులు గడుస్తాయి. పదోతేదీన ఎవరు ఎన్ని అరుస్తూ ఉన్నా సరే యనమల బడ్జెట్‌ను చదివేస్తారు. ఆ తర్వాత కూడా సభ జరిగినన్ని రోజులూ వైకాపా సభ్యులు స్పీకరు పోడియం చుట్టూ చేరి అరుస్తూనే ఉంటారు. ప్రతిరోజూ సభ వాయిదా పడుతూనే ఉంటుంది. చివరి రెండు రోజుల్లో వైకాపా సభ్యుల్ని సస్పెండ్ చేసేసి సభలో పెట్టిన బిల్లులు అన్నిటినీ ఆమోదించేస్తారు. అక్కడితో ఇక మంగళం మహత్.
గత శీతాకాల సమావేశాలు ఇదే క్రమంలో తగలబడిపోవడానికి కాల్‌మనీ యవ్వారాన్ని ఎంచుకున్న వైకాపా ఈసారి భూకుంభకోణాన్ని బయటకు తీసింది. దానికి సంబంధించి తాము గుప్పిస్తున్న ఆరోపణలు అన్నిటికీ ప్రభుత్వం సంజాయిషీ ఇవ్వాలని, న్యాయవిచారణ జరపాలని అలాంటి కొన్ని డిమాండ్లతో సభను జరగనివ్వకుండా చేసేస్తుంది. కాల్‌మనీ ఇప్పుడు ఏమైందో తెలియదు. కానీ దాని పుణ్యమాని శీతాకాల అసెంబ్లీ తగలబడి పోయింది. ఈ భూకుంభకోణం మరో రెండునెలల తర్వాత ఏమవుతుందో తెలియదు.. కానీ ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మాత్రం సరైన చర్చలు లేకుండా తగలడిపోతాయి.
ఈ మాత్రం దానికి జనానికి అసెంబ్లీ సమావేశాలు అంటేనే ఆసక్తి తగ్గిపోతున్నట్లుంది.