ఫిబ్రవరి నాలుగో తేదీన అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం నుంచి బస్సుయాత్ర ప్రారంభించారు. అక్కడ బహిరంగసభ జరగాల్సి ఉన్నా… జనం లేకపోవడంతో రద్దు చేసుకున్నారు.. ఆ తర్వాత బస్సుయాత్రను ప్రారంభించి… జెండా ఊపి.. ఢిల్లీకి వెళ్లిపోయారు. ఇప్పుడా బస్సు యాత్ర.. ఎక్కడ సాగుతుందో.. ఎవరికీ అర్థం కావడం లేదు. షెడ్యూల్ ప్రకారం 15 రోజుల్లో 85 నియోజకవర్గాల మీదగా యాత్ర కొనసాగాలి. చివరిగా కర్నూలు జిల్లా ఆదోనిలో ముగిసేలాగా రూట్ మ్యాప్ సిధ్ధం చేసుకున్నారు. యాత్ర నిర్వహణకు పార్టీ 8కమిటీలను నియమించింది. బస్సు యాత్రలో భాగంగా జిల్లాల్లోని ప్రధాననగరాల్లో బహిరంగసభలు జరుగుతాయని ప్రకటించారు. ప్రతి జిల్లాలో కేంద్ర మంత్రులు పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని ఉదరగొట్టారు. కానీ పదిహేను రోజులు ముగిశాయి కానీ..ఆ బస్సు ఎక్కడ ఉందో ఎవరికీ తెలియడం లేదు.
పలాసలో… బస్సుయాత్రను అమిత్ షా ప్రారంభించిన తర్వాత… మరో నియోజకవర్గానికి పార్టీ నేతలు వెళ్లారు. కానీ.. ఆ నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సులో అయినా జనం కనిపించారు కానీ.. బీజేపీ బస్సు చుట్టూ ఎవరూ కనిపించలేదు. అందుకే.. వెంటనే యాత్రను నిలిపివేసినట్లు తెలుస్తోంది. యాత్రను ప్రారంభించిన రెండో రోజే.. మోడీ గుంటూరు పర్యటనకు ఏర్పాట్ల పేరుతో.. కన్నా లక్ష్మినారాయణ బస్సును వదిలేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన గుంటూరులోనే మకాం వేశారు. బస్సుయాత్రను మళ్లీ పట్టించుకోలేదు. ఇక ఏపీ బీజేపీ తరపున టీవీ చర్చల్లో… పెద్దగా నోరు చేసుకునే నేతలను బయటకు వెళ్తే గుర్తు పట్టే వారు ఉండరు.. పట్టుమని పది మంది కార్యకర్తలు వారికి ఉండరు. దాంతో… వారెవరూ.. బస్సుయాత్ర గురించి ఆలోచించలేదు.
నిజానికి భారతీయ జనతా పార్టీ నేతలు బస్సుయాత్ర గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఆ బస్సు లగ్జరీని… హైలెట్ చేసుకున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో కోట్ల ఖర్చుతో బస్సును తయారు చేయించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, ప్రచార సారధి సోము వీర్రాజు ఈ బస్సులో.. ప్రజలకు అభివాదం చేస్తూ ప్రచారం చేస్తారని.. అనుకున్నారు. కానీ లగ్జరీ బస్సు ఉంది.. అభివాదం చేయడానికి నేతలున్నారు కానీ… ప్రజలే లేకపోవడంతో.. బస్సును.. షెడ్డుకు పంపించినట్లుగా తెలుస్తోంది.