ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు కూడా తమకు ఓ ఎమ్మెల్సీ కావాలని అడుగుతున్నారు. ఇప్పటి వరకూ వారు బహిరంగంగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. కానీ ఢిల్లీ స్థాయిలో చేసిన లాబీయింగ్ తో కొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. బీజేపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ గా ఉన్న పాకా వెంకట సత్యనారయణకు అవకాశం కల్పించాలని ఆయన పేరును తెరపైకి తెచ్చారు. దీంతో కూటమి ఎమ్మెల్సీ సీట్ల విషయంలో ఏం జరుగుతోందా అన్న ఆసక్తి ప్రారంభమయింది.
ఎమ్మెల్యే సీట్లే బీజేపీకి.. జనసేన పార్టీ త్యాగం చేసింది. ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ త్యాగం చేయాల్సి వచ్చేలా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కూటమిలో భాగంగా టీడీపీ నేతలు ఎంతో మంది తమ సీట్లను త్యాగం చేశారు. వారు ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. వారి అవకాశాలను ..బీజేపీ నేతలు అందుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీకి రాజ్యసభ సీట్లు కూడా కేటాయించారు. విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సీటు కూడా బీజేపీకే వెళ్తుందని అంటున్నారు.
చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకావిష్కరణ కోసం విశాఖ వచ్చినా మళ్లీ వెంటనే ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడే ఏదోక విషయం తేల్చే అవకాశం ఉంది. వచ్చే కొన్నేళ్ల పాటు వైసీపీకి ఒక్క ఎమ్మెల్సీ కూడా రాదు కాబట్టి.. తదుపరి అవకాశం కల్పిస్తామని.. త్యాగం చేసిన టీడీపీ నేతలకు అవకాశాలు కల్పించాల్సి ఉందని చంద్రబాబు చెప్పే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు.