ఆంధ్రప్రదేశ్లో టీడీపీ-జనసేన పొత్తు కూడా కుదుర్చుకున్నాయి. ఈ పొత్తులో తమతో పాటు బీజేపీ కూడా కలుస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇదే పొత్తు అంశంలో ప్రస్తుతం ఏపీ బీజేపీలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఉంటుందో ఉండదో తెలియడం లేదు. పొత్తు ఉంటే సీట్లు సంపాదించుకుందామని కొంత మంది తాపత్రయ పడుతున్నారు. పొత్తు లేకపోతే పోటీ చేయడం దండగనుకుంటున్నారు.
ఏపీలో ఒంటరిగా పోటీ చేయాలా..? లేకుంటే టీడీపీ-జనసేన కూటమితో పొత్తులతోనే ముందుకు వెళ్లాలా..? అనే దానిపై హైకమాండ్ తేల్చడం లేదు. ఇందుకోసమే ఏపీ బీజేపీ అభ్యర్థులను ప్రకటించలేదని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అటు పార్లమెంట్.. ఇటు అసెంబ్లీలో ఏపీ నుంచి నేతలు తప్పకుండా అడుగుపెట్టాల్సిందేనని అనుకుంటున్నారు. ఒంటరిగా పోటీ చేస్తే సాధ్యం కాదు.
అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. బీజేపీ మాత్రం..ఎలాంటి ప్రిపరేషన్లు చేపట్టలేకపోయింది. ఇంత వరకూ కనీస ప్రచార ప్రణాళిక లేదు. ఒక్క బహిరంగసభ నిర్వహించలేదు. చిన్న చిన్న కార్యక్రమాలు ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారు. దీనికి కారణం పొత్తులు ఖచ్చితంగా ఉంటాయన్న ఓ నమ్మకమే. అయితే కారణాలేమిటో కానీ.. అసలు అడుగు ముందుకు పడటం లేదు. మరో వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు అన్ని స్థాయాల్లో పోటీ చేయడం కూడా సాధ్యం కాని విషయం. గతంలోలా నిలబడితే.. ఒక్క చోట కూడా డిపాజిట్ వస్తుందన్న గ్యారంటీ లేదు.