ఏపీ బీజేపీలో సోము వీర్రాజు, జీవీఎల్ మినహా మిగతా అందరు నేతలు ఏకమవుతున్నారు. మంగళవారం విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సోము , జీవీఎల్ ఇద్దరూ కలిసి బీజేపీని నాశనం చేశారని.. చివరికి వైసీపీకి తాకట్టు పెట్టేస్తున్నారని వారి నుంచి పార్టీని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీలో సుదీర్ఘ కాలంగా ఉన్న నేతలతో పాటు ఇటీవల కొత్తగా చేరిన వారు కూడా సోము, జీవీఎల్ నాయకత్వానికి అనుకూలంగా లేరు. వారి తీరు తేడాగా ఉందని.. వారు వైసీపీ కోసం పని చేస్తున్నారో.. బీజేపీ కోసం పని చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉందంటున్నారు.
చాలా రోజుల క్రితమే బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్ నేతృత్వంలో విజయవాడలో రహస్యంగా నేతలు సమావేశం అయ్యారు. సోము ను తప్పించి సత్య కుమార్ కు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టాలని ఆ సమావేశంలో ప్రాథమికంగా నిర్ణయించారు.. అదే అంశాన్ని నేతలంతా హైకమాండ్‌కు చెప్పాలనుకున్నారు. కానీ ఢిల్లీ స్థాయిలో జీవీఎల్ వెంటనే చక్రం తిప్పారు. ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ ధియోధర్ తో ఎన్నికల వరకూ సోము వీర్రాజే ఉంటారని ప్రకటించారు. సోము వీర్రాజు వ్యవహారాలపై ఢిల్లీ వరకూ విషయాలు వెళ్లకుండా చూసుకున్నారు.
అయితే ఇప్పుడు సోము, జీవీఎల్ వ్యవహారాలపై పూర్తి స్థాయిలో నేతలు ఓ నివేదికను తయారు చేసి హైకమాండ్‌కు పంపాలనుకుంటున్నారు. పార్టీ బలోపేతం కాకుండా సోము వీర్రాజు చేసిన కుట్రలను అందులో వివరించనున్నట్లుగా చెబుతున్నారు. పార్టీలో చేరిన వారిపై కోవర్టుల ముద్ర వేయడం.. ఎవరూ చేరకుండా చేయడం… పార్టీలో వర్గాలను పెంచడం.. రెండు ముక్కలుగా చేసి.. ఓ వర్గాన్ని పూర్తిగా పార్టీకి దూరం చేయడం వంటివన్నీ నివేదికలో పొందుపర్చాలనుకుంటున్నారు. వారం రోజుల్లో బీజేపీకి సామూహిక రాజీనామాలు ఉంటాయన్న ప్రచారం ఈ కారణంగానే ఊపందుకుంటోంది.