సప్తసముద్రాలు అలవోకగా ఈది… పిల్లకాలువలో పడి కొట్టుకుపోవడం అంటే ఏమిటో.. ఇప్పుడు భారతీయ జనతాపార్టీ అగ్రనాయకత్వానికి అర్థం అవుతోంది. ఉత్తరప్రదేశ్, గుజరాత్ లాంటి పాలిత రాష్ట్రాలకు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుల్ని క్షణాల్లో నియమించగల సామర్థ్యం ఉన్న .. బీజేపీ హైకమాండ్.. ప్రజల్లో ఏ మాత్రం పట్టు లేని.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం… తమ శాఖ అధ్యక్షుడ్ని నియమించుకోవడానికి నానా తిప్పలు పడుతోంది. మూడేళ్ల నుంచి కొత్త అధ్యక్షుడ్ని నియమించడానికి కసరత్తు చేస్తున్నా తెమలడం లేదు.
విశాఖపట్నం ఎంపీగా హరిబాబు ఎన్నికయిన తర్వాత ఏడాదిన్నరకి ఆయన పదవి కాలం ముగిసింది. అప్పుడే.. కొత్త అధ్యక్షుడి ఎంపిక త్వరలో అని హైకమాండ్ ప్రకటించింది. కానీ ఆ త్వరలో ఇంత వరకూ రాలేదు. కులసమీకరణలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ… ముందడుగు వేస్తోందని… రకరకాల కథనాలు వినిపించాయి. కానీ ఈ రెండున్నరేళ్లలో బీజేపీ ఓ పది ముఖ్య రాష్ట్రాలకు బీజేపీ అధ్యక్షులను నియమించింది.కానీ ఏపీ విషయంలో మాత్రం నిర్ణయం తీసుకోలేకపోయింది. ఓ సందర్భంలో.. బీజేపీ అధ్యక్షుడ్ని నియమించడానికి టీడీపీ అడ్డుపడుతోందన్న వింత వాదనను తెరపైకి తెచ్చారు. రేసులో సోము వీర్రాజు ముందున్నారని.. ఆయన టీడీపీని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారని.. ఆయనకు పదవి ఇవ్వవద్దని టీడీపీ .. లాబీయింగ్ చేసిందని బీజేపీ నేతలే చెప్పుకొచ్చారు. తమ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో టీడీపీ ఎలా జోక్యం చేసుకుంటుందో.. చెప్పలేకపోయారు. కానీ.. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత కూడా.. వారు ఏపీ అధ్యక్షుడ్ని ఎంపిక చేసుకోలేకపోతున్నారు.
నిజానికి… బీజేపీకి ఏపీలో ఎలాంటి బలం లేదు. కనీసం పంచాయతీలను కూడా… చేతి వేళ్ల మీద లెక్క పెట్టుకోగలినన్ని గెలిచే పరిస్థితి లేదు. కానీ ఉన్న కొద్ది మంది నేతల్లో మాత్రం… వర్గాలు చాలా ఉన్నాయి. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంలో చాలా ముందు ఉంటారు. అందుకే నియామకం ఆలస్యమవుతోంది. దూకుడుగా ఉంటారని సోము వీర్రాజుకు ఇస్తామంటే… సాటి కాపు నేతలే అడ్డుకుంటున్నారు. తాము పార్టీ మారడానికైనా సిద్ధమంటూ హైకమాండ్ కు తెగేసి చెబుతున్నారు. అదే సమయంలో… రాయలసీమ నేతల నుంచి కూడా.. సోము వీర్రాజు అభ్యర్థిత్వంపై వ్యతిరేకత వస్తోంది. వారు ఈ సారికి సీమకు చాన్సివ్వాలంటున్నారు.
సరే ఈ ఇబ్బందులన్నీ ఎందుకు అందర్నీ కలుపుకుపోయే.. మాణిక్యాలరావుకు ఇద్దామని హైకమాండ్ ఓ దశలో నిర్ణయం తీసుకుంది. కానీ మాణిక్యాలరావు మరీ మెతక అని ఆయనకు ఇస్తే.. బీజేపీ బలపడటం అసాధ్యమని మరో గ్రూపు.. ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసింది. ఈ డ్రామా ఇలా సాగుతూండగానే.. హఠాత్తుగా తాత్కాలికంగా అయినా పార్టీ బాధ్యతలు చూస్తున్న కంభంపాటి హరిబాబు.. కాడి పడేశారు. పార్టీ అధ్యక్ష పదవికి గుడ్ బై చెప్పారు. ఓ వైపు ఎవర్నీ ఎంపిక చేయాలో చిక్కుముడులు వీడకపోతూంటే… వెంటనే అధ్యక్షుడ్ని ఎంపిక చేయాల్సిన పరిస్థితిని హరిబాబు తెచ్చి పెట్టారు. బీజేపీ అధికారంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో కూడా లేనన్ని గ్రూప్ తగాదాలు ఏపీ బీజేపీలో కనిపిస్తున్నాయి. అది హైకమాండే పరిష్కరించలేకపోతోంది. సప్తసముద్రాలు ఈదిన వారికి..పిల్లకాలువ గండం రావడం అంటే ఇదే మరి..!