ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు హఠాత్తుగా ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. ఏపీలో పెద్ద ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందని..ఏపీ సర్కార్ పట్టించుకోవడం లేదని… కేంద్రం జోక్యం చేసుకుని .. ఎర్రచందనాన్ని రక్షించాలని కోరారు. దీనిపై కిషన్ రెడ్డి స్పందించారు. ఎర్రచందనం అక్రమ రవాణా.. విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఏపీ ప్రభుత్వానికి లేఖ రాస్తామని హామీ ఇచ్చారు. అయితే ఏపీ బీజేపీ నేతుల హఠాత్తుగా ఎర్రచందనం అంశాన్ని ఎందుకు పైకి తెస్తున్నారనేది ఇప్పుడు.. రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తిరుపతి, శేషాచలం కొండల్లో ఎర్రచందనం అడవులు ఉన్నాయి. రాజకీయ నేతలే ఎర్రచందనం స్మగ్లర్లు అని ప్రచారం ఉంది.కానీ ఎవరూ చిక్కరు. తమిళ కూలీల్నీ పెద్ద ఎత్తున తీసుకు వచ్చి.. అడవుల్ని కొట్టేసి… ఎర్రచందనాన్ని విదేశాలకు రవాణా చేస్తూంటారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ప్రత్యేక నిఘా పెట్టారు. అక్కడ స్మగ్లర్లు పట్టుబడని రోజే లేదు. ఎంత కఠిన చర్యలు తీసుకున్నా.. స్మగ్లర్లు వెనక్కి తగ్గకపోవడంతో ఓ సారి.. ఎన్ కౌంటర్ కూడా చేశారు. చెన్నై, కోల్ కతా లాంటి చోట్ల నిల్వ చేసిన ఎర్రచందనం దుంగల్ని కూడాపట్టుకొచ్చారు. కేంద్రం అనుమతితో రెండు సార్లు వేలం వేసి రూ. రెండు వేల కోట్ల ఆదాయం కూడా పొందారు.
అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుబడటం లేదు. అలా అని .. గత ప్రభుత్వం కన్నా ఎక్కువ కఠిన చర్యలు తీసుకున్నారా అంటే అదీ లేదు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటోందని… రాజకీయ నేతలైన ఎర్రచందనం స్మగ్లర్లు పెద్ద ఎత్తున తరలించేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం కూడా.. గోడౌన్ల నుంచి మాయమయిందన్న ఆరోపణలు కూడా వచ్చాయి.ఇలాంటి సందర్భంలో.. బీజేపీ నేతలు ఎర్రచందనం విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం ఆసక్తి రేపుతోంది.