ప్రపంచం అంతా కరోనా సంక్షోభంలో ఉంది. ఓ వైపు కేసుల సంఖ్య పెరుగుతూంటే.. మరో వైపు… ఆర్థిక వ్యవస్థ కుంగిపోయింది. దాంతో.. అంచనాలు తగ్గించుకుని ఉన్నదాంతో నెట్టుకు రావాలని ప్రపంచదేశాలన్నీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం… కరోనా గిరోనా జాన్తా నై అంటోంది. కరోనా వస్తుంది… పోతుంది అన్న విధానానికే కట్టుబడినట్లుగా ఉంది. కరోనా వల్ల వచ్చిన ఆర్థిక పరిస్థితులు.. ఇతర అంశాలను పట్టించుకోకుండా… బడ్జెట్ను రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలుగా సిద్దం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పదహారో తేదీన అసెంబ్లీలో పెట్టనున్న బడ్జెట్ ఆ స్థాయిలో ఉంటుందని చెబుతున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో అంచనా వేసుకున్న ఆదాయానికి.. వచ్చిన ఆదాయానికి.. అసలు పొంతన లేదు. దాదాపుగా 70 శాతం తక్కువగా ఉంది. ఇప్పటికీ పరిస్థితులు మెరుగుపడలేదు. ఈ ఏడాది మొత్తం ప్రభావం ఉంటుందని అధికార వర్గాలు అంచనా వేశాయి. అందుకే.. దానికి తగ్గట్లుగా బడ్జెట్ అంచనాల్ని రూపొందించి. రెండు లక్షల కోట్లలోపే.. బడ్జెట్ను సిద్ధం చేశారు. కానీ ముఖ్యమంత్రి జగన్ ఆ ప్రతిపాదనల్ని చూసి అసంతృప్తి వ్యక్తం చేయడంతో.. రెండు లక్షల అరవై వేల కోట్ల వరకూ మార్చి ప్రవేశ పెట్టబోతున్నారని చెబుతున్నారు. ఏపీ సర్కార్ ప్రస్తుతం అందిస్తున్న సంక్షేమ పథకాలకు.. లబ్దిదారుల జాబితాలను భారీగా తగ్గించిన తర్వాత కూడా… ఏడాదికి 80వేల కోట్ల వరకూ ఖర్చు చేయాల్సి ఉంది. వచ్చే నెల నుంచి పెన్షన్ను రూ. 250 పెంచుతామని గత నెలలోనే ప్రకటించారు.
అలాగే.. మొదటి ఏడాది ప్రారంభించలేకపోయిన డ్వాక్రా రుణమాఫీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 75వేలు లాంటి భారీ పథకాలను ఈ ఏడాది నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది. డ్వాక్రా రుణమాఫీ అన్నింటి కంటే పెద్ద పథకం. దాదాపుగా కోటి మంది మహిళలు డ్వాక్రా సభ్యులుగా ఉన్నారు. వారందరికీ రూ. 12500 మాఫీ చేయాల్సి ఉంది. అంటే రూ. పన్నెండు వేల ఐదు వందల కోట్లు కావాల్సి ఉంటుంది. ఇక్కడ.. కులాలు, మతాలు.. ఆదాయపు పన్నుల.. కరెంట్ యూనిట్లు… లాంటి నిబంధనలు పెట్టి తగ్గించడానికి అవకాశం లేదు. అందుకే మేనిఫెస్టో ప్రకారం కేటాయింపులు చేయాలంటే.. కనీసం.. రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ ఉండాల్సిందే. ఒక వేళ తగ్గిస్తే.. పథకాలకు కత్తిరించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి రాకుండా… పాత బడ్జెట్ కన్నా ఎక్కువే పెట్టాల్సి ఉంటుందని చెబుతున్నారు.