బడ్జెట్ అంటే చాలా మంది ఆసక్తి చూపిస్తారు. నాలుగైదు రోజుల ముందు నుంచీ చర్చ జరుగుతుంది. కానీ.. ఏపీ ప్రభుత్వ బడ్జెట్ వచ్చే సరికి పట్టించుకునేవారే లేరు. ఆ బడ్జెట్టా అని లైట్ తీసుకుంటున్నారు. ఏదో పత్రం ప్రవేశ పెడుతున్నట్లుగా ఫీలవుతున్నారు కానీ అది వచ్చే ఆర్థిక సంవత్సరానికి ముఖ్యంగా ఎన్నికలకు ముందు పెట్టే పూర్తి స్థాయి బడ్జెట్ అని .. ఎంతో కీలకం అని ఎవరూ అనుకోవడం లేదు. దీనికి కారణం… పద్దుల్లో ఏమీ ఉన్నా.. చివరికి ఖర్చు పెట్టేది మాత్రం రోజువారీ సొమ్ములు వెదుక్కుని మీట నొక్కడమే.
ఉద్యోగులజీత భత్యాలు, పెన్షన్ల కోసమే వచ్చే ఆదాయంలో 80 శాతం వరకూ సరిపోతుంది. వారికి ఇవ్వాల్సినవే చాలా వరకూ పెండింగ్‌లో పెట్టారు. ఇక అభివృద్ధి పనుల కోసం అప్పులు చేసి ఖర్చు పెట్టాలి. కానీ ఇప్పుడు అప్పులు చేసి సంక్షేమ పథకాలు బటన్లు నొక్కుతున్నారు. దీని వల్ల రుణ భారం పెరుగుతోంది. ఆదాయం పెరగడం లేదు. ప్రపంచంలో ఎక్కడా లేనంత వృద్ధి ఏపీలో ఉందని లెక్కలేసి అప్పులు తెస్తున్నారు.. వాటిని వడ్డీలకు… సంక్షేమానికి మళ్లిస్తున్నారు. వాటిని తిరిగి చెల్లించడానికి మళ్లీ అప్పులు తెస్తున్నారు.
ఓ ప్రభుత్వం ఆదాయానికి మించి అప్పులు చేస్తోందంటే… అంత కంటే దివాలా స్థితికి మరో నిదర్శనం ఉండదు. ఇప్పుడు ఏపీ అదే స్థితిలో ఉంది. ఈ ఏడాది చాలా కష్టంగా గడిచింది. వచ్చే ఏడాది మరింత దారుణంగా పరిస్థితులు ఉండనున్నాయి. ఈ ఏడాది పథకాలకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా పెండింగ్ పెడుతూ వస్తున్నారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ సహా చాలా పథకాలకు నిధులు విడుదల చేయలేదు. ఆర్థిక సంవత్సరం మారిపోతోంది.
బడ్జెట్ లో కేటాయించిన నిధులు విడుదల చేయనివి కొన్ని వేల కోట్లు ఉంటాయి. అనేక శాఖల్లో ఈ పరిస్థితి ఉంది. అందుకే బడ్జెట్‌కు ప్రాధాన్యత లేకుండా పోయింది. ఎవరూ పట్టించుకోవడం లదు.