2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ బడ్జెట్ ను ప్రతిపాదించింది. మొత్తంగా రూ.3 లక్షల 22 వేల 359 కోట్లతో పద్దును ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశ పెట్టారు. తొలిసారి రూ.3 లక్షల కోట్లు దాటింది. ఇందులో రూ.48,340 కోట్లును వ్యవసాయానికి కేటాయించారు. మూలధనం అంచనా వ్యయం రూ.40,635 కోట్లు, రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లుగా తేల్చారు. అయితే అటు రెవిన్యూ.. ఇటు ద్రవ్యలోటు భారీగా ఉండనుంది. రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగాకేశవ్ ప్రకటించారు.
అభివృద్ధి సంక్షేమాలకు సమ ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ. 20 వేలు ఇచ్చేలా కేటాయింపులు చేశారు. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇవ్వనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లల్లో చదివే విద్యార్థులందరికీ .. స్కూళ్లు తెరిచే నాటికి జమ చేయనున్నారు. ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా కూడా ఈ? బడ్జెట్లో ప్రతిపాదించారు. దాదాపుగా ప్రతి రంగానికి మెరుగైన కేటాయింపులు చేశారు. సూపర్ సిక్స్ పథకాలు ఈ ఏడాది పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అవసరమైన నిధులను కేటాయించారు.
అదే సమయంలో అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు కేటాయించారు. అమరావతి నిర్మాణానికి ఆరు వేల కోట్లు కేటాయించారు. మిగతా నిధులు కేంద్రం గ్రాంటుగా.. రుణాలుగా ఇస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రక్రియలు పూర్తయ్యాయి. ఎన్నికల కోడ్ ముగియగానే.. మార్చి పదిహేనో తేదీ నుంచి పనులు ప్రారంభం కానున్నాయి. వైసీపీ హయాంలో నిర్లక్ష్యం చేసిన సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలకూ పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు.
కేటాయింపుల వరకూ అద్భుతంగా ఉన్నా.. ఈ ప్రభుత్వం ముందు ఉన్న అతిపెద్ద సవాల్.. చూపించిన మేరకు సంపదను సృష్టించి ఆదాయాన్ని పెంచుకోవడం. ఇప్పటికే మెరుగైన వృద్ధి రేటు సాధించామని రాబోయే రోజుల్లో అది ఆదాయం రూపంలో ప్రతిఫలిస్తుందని ప్రభుత్వం నమ్ముతోంది. సంపదను సృష్టించి ప్రకటించిన బడ్జెట్ మేరకు కేటాయింపులు చేసి.. ఖర్చు పెడితే ప్రభుత్వం అద్భుత పనితీరు కనబర్చినట్లే.