ఆలయాల విషయంలో వరుసగా చోటు చేసుకుంటున్న వివాదాల నేపధ్యంలో దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని.. దాన్ని ఛేదిస్తామని ప్రకటించారు. ఆయన అలా అనడానికి కారణాలు ఉన్నాయి. అంతర్వేదిలో హిందూ సంఘాల భక్తులు వారిపై దాడులకు ప్రయత్నించారు. కార్లపై రాళ్లేశారు. అతి కష్టం మీద వారని పోలీసులు తరలించగలిగారు. అందుకే.. ఆయన తమ ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందన్న అభిప్రాయానికి వచ్చారు. అలాంటి అభిప్రాయం ఉన్నప్పుడు.. జరుగుతున్న ఘటనల్ని అంత తేలికగా తీసుకోవడం ఎందుకన్న మౌలికమైన ప్రశ్న సహజంగానే వస్తోంది.
ఘటనలను మతి స్థిమితం లేని వారి ఖాతాలో వేసి లైట్..!
కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ఆలయాలపై లెక్కలేనన్ని దాడులు జరిగాయి ఫిబ్రవరిలో నెల్లూరు జిల్లా కొండ బిట్రగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి రథానికి నిప్పు పెట్టారు. ప్రభుత్వం విచారణ లేకుండా మతి స్థిమితం లేని వారి అని తేల్చింది. ఆ తర్వాత పిఠాపురంలో దేవతా విగ్రహలనూ ధ్వంసం చేశారు. ఆ ఘటననూ అలాగే మతి స్థిమితం లేని వారి ఖాతాలో వేసింది. ఇప్పుడు అంతర్వేది లక్ష్మినరసింహస్వామి రథానికి నిప్పు పెడితే.. తేనే తుట్టె ఖాతాలో వేసేసింది. ఈ మూడు మాత్రమే కాదు.. ఈ పధ్నాలుగు నెలల కాలంలో ఆయాల్లో జరిగిన అనేక ఘటనలకు యాధృశ్చికంగా జరిగాయని చెప్పుకొచ్చింది తప్ప.. ఒక్కరిపైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
ప్రభుత్వ నిర్ణయాలూ అసహనాన్ని పెంచుతున్నాయా..?
హిందూ ధార్మిక సంస్థల విషయంలో ప్రభుత్వ నిర్ణయాలు.. వ్యతిరేకంగా ఉంటున్నాయని కొంత కాలంగా ఆరోపణలు వస్తున్నాయి. వచ్చీ రాగానే తిరుమలలో లడ్డూ దగ్గర్నుంచి అన్నీ భారం చేసేశారు. అన్యమతస్తులైన ఉద్యోగులు దర్జాగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. హిందూ ఆలయాలకు ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వదు. ఆలయాలు భక్తులు ఇచ్చే కానుకలు, విరాళాల మీదే నడుస్తాయి. దాతలు ఇచ్చిన మాన్యాలు అత్యధిక ఆలయాలకు రాబడి ఇస్తూంటాయి. అయితే.. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆలయాల మాన్యాలకు రక్షణ లేకుండా పోయింది. ఏకంగా టీటీడీ భూములనే అమ్మకానికి పెట్టారు. సింహాచలం అప్పన్న భూముల వ్యవహారం ఇప్పుడు అనేక మలుపులు తిరుగుతోంది. ప్రస్తుతం ఆ ఆలయం ప్రైవేటు వ్యక్తి గుప్పిట్లోకి వెళ్లిపోయింది.
ఆందోళనలకు కారణం సహనం నశిస్తున్న సూచనలు …!
అంతర్వేదిలో హిందూ సంఘాలు… భక్తుల ఆగ్రహం ఓ దశలో అదుపుతప్పేలా కనిపించింది. ఇంత కాలం సహనంగా ఉన్న వారు ఒక్క సారిగా ఎలా ఎందుకు ఉద్రేకపడుతున్నారంటే.. ఒక్కటే కారణం అని అనుకోవచ్చు. వరుసగా ఆలయాలను టార్గెట్ చేయడమే కాదు.. అలా జరగడాన్ని చాలా తేలికగా ప్రభుత్వం తీసుకుంటూ వచ్చింది. మామూలుగా అయితే..ఇలాంటి ఘటనలు జరిగితే.. కుట్రదారుల్ని కనిపెట్టి… ప్రభుత్వాలు చర్యలు తీసుకునేవి. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వరకూ జరిగిన ఘటనల్లో ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. పిచ్చివాళ్ల పని అంటూ తేలిగ్గా తీసేయడం ప్రారంభించారు. దీంతో భక్తుల్లో గూడుకట్టుకున్న అసహనం.. ఒక్క సారిగా బయటకు వచ్చిన సూచనలు కనిపిస్తున్నాయి. దానికి అంతర్వేది ఘటనలే ఉదాహరణ.
కుట్రను ఛేదిస్తేనే ప్రభుత్వానికి విశ్వసనీయత..!
కుట్ర జరిగిందని .. త్వరలోనే చేధిస్తామని మంత్రి వెల్లంపల్లి చెబుతున్నారు. ప్రభుత్వంపై కుట్ర జరిగిందా.. లేకపోతే ఆలయాలపై కుట్ర జరిగింది.. లేక హిందూ విశ్వాసాలపై దాడి చేస్తున్నారా.. అన్నది తేల్చాల్సింది ప్రభుత్వమే. కుట్రలను చేధించి నిజాలను ప్రజల ముందు ఉంచాలి. దోషలను శిక్షించాలి. లేకపోతే ప్రభుత్వంపై విమర్శలు మరింత పెరుగుతాయి.