ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణకు.. ముఖ్యమంత్రి చంద్రబాబు ముహుర్తం ఖరారు చేశారు. ఈ నెల పదకొండున ఉదయం 11.45 నిమిషాలకు విస్తరణ ఉంటుంది. దీనిపై అధికారిక ప్రకటన విడుదలయింది. ప్రస్తుతం మంత్రివర్గంలో రెండు ఖాళీలు ఉన్నాయి. ప్రాతినిధ్యం లేని.. మైనార్టీ, ఎస్టీ వర్గాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని.. చంద్రబాబు చాలా కాలం కిందట నిర్ణయించారు. వివిధ కారణాల రీత్యా వాయిదా పడుతూ వస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కారణంగా.. వీలైనంత త్వరగా మంత్రి వర్గ విస్తరణ పూర్తి చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఉండవల్లిలోనే ఈ విస్తరణ కార్యక్రమం ఉంటుంది.
కొత్తగా మంత్రులు ఎవరవుతారనే దానిపై.. టీడీపీలో కొంత క్లారిటీ ఉంది. మైనార్టీ వర్గాలకు సంబంధించి కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఎన్ఎండీ ఫరూక్, అలాగే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ షరీఫ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల కిందట.. షరీఫ్ కు బెర్త్ ఖరారయిందని ప్రచారం జరిగింది. అయితే రాయలసీమలో ముస్లింల సంఖ్య అధికంగా ఉంటుంది కాబట్టి… ఫరూక్ కు మంత్రి పదవి ఇచ్చి… షరీఫ్ ను శాసన మండలికి చైర్మన్ ను చేయాలనే సూచనలు పార్టీ నేతల నుంచి వచ్చాయి. అయితే ఎవరికి మంత్రి పదవి ఇస్తున్నాననే విషయంపై.. చంద్రబాబు ఇప్పటి వరకూ … క్లారిటీగా చెప్పలేదు. కానీ ఈ ఇద్దరిలో ఫరూక్ కే ఎక్కువ చాన్స్ ఉందని టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.
వాస్తవానికి చంద్రబాబు ఒక్క మైనార్టీ వర్గానికి మంత్రి పదవి ఇచ్చి సరి పెట్టాలనుకున్నారు. కానీ … అనూహ్యంగా… అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును… మావోయిస్టులు హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆయన.. కిడారి కుటుంబానికి న్యాయం చేసేందుకు ఆయన పెద్ద కుమారుడు శ్రావణ్ కుమార్ కు మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారు. ఐఐటీ నుంచి ఇంజనీరింగ్ చదివిన శ్రావణ్‌కుమార్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని కీలక శాఖ అప్పగిస్తే, ప్రజల్లోకి.. ప్రత్యేకించి గిరిజనుల్లోకి మంచి సంకేతాలు వెళతాయని ..గిరిజనులకు మంత్రివర్గంలో అవకాశమివ్వలేదనే విమర్శ తొలగిపోతుందని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున ఒక్క ఎస్టీ ఎమ్మెల్యే మాత్రమే ఎన్నికయ్యారు. దాంతో చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం కల్పించలేకపోయారు. శ్రావణ్ కుమార్ కు మంత్రి పదవి ఇస్తే ఆరు నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అయితే..ఇప్పుడు ప్రమాణస్వీకారం చేసినా.. ఎన్నికలు ఆరు నెలల్లోనే వస్తాయి కాబట్టి.. ఎక్కడా ఎన్నిక కాకపోయినా ఇబ్బంది ఉండదని.. టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.