ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం మూడురాజధానుల బిల్లు గవర్నర్ వద్దకు చేరింది. ఇప్పుడు గవర్నర్ సంతకం చేస్తారా లేదా.. అన్నదానిపై.. ఉత్కంఠ ప్రారంభమయింది. మామూలుగా అయితే.. బిల్లులు వచ్చినరోజే సంతకం చేసి పంపించి.. ప్రభుత్వానికి అనుకూలంగా.. శరవేగంగా పని చేస్తూ ఉంటారు గవర్నర్. శనివారం.. బిల్లులు రాజ్‌భవన్‌కు చేరినప్పటికీ.. సాయంత్రం వరకూ సంతకం చేసినట్లుగా సమాచారం బయటకు రాలేదు. సోమవారం సంతకం చేస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఈ లోపు విపక్ష పార్టీలన్నీ వరుసగా… గవర్నర్‌కు లేఖలు రాయడం ప్రారంభించాయి.
తెలుగుదేశం పార్టీ నేత యనమల రామకృష్ణ, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ సహా.. అన్ని విపక్ష పార్టీలకు చెందిన నేతలు… గవర్నర్‌కు.., ఆ బిల్లును ఆమోదించవద్దని విజ్ఞప్తి చేశారు. న్యాయ సలహా .. రాజ్యాంగ నిపుణుల సలహా తీసుకోవాలని కోరుతున్నారు. అదే సమయంలో.. విభజన చట్టాన్ని మార్చేలా.. బిల్లు ఉందని… అది చెల్లదనే వాదననూ తెరపైకి తీసుకు వచ్చారు. వీలైనంత వరకూ గవర్నర్‌పై ఒత్తిడి పెంచేందుకు విపక్ష పార్టీలన్నీ…విడివిడిగా ప్రయత్నిస్తున్నాయి. జంధ్యాల రవిశంకర్ వంటి న్యాయవాదులు కూడా… గవర్నర్ ఆలోచించి .. నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
ఇప్పటికే గవర్నర్ అనేక వివాదాల్లో ఇరుక్కున్నారు. రాజ్యాంగాధిపతిగా ఉంటూ.. రాజ్యాంగ ఉల్లంఘన ఉత్తర్వులకు ఆమోదం తెలుపుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం చెప్పిన ఎస్ఈసీ తొలగింపు ఆర్డినెన్స్ ఆయన జారీ చేయడంతో… ఇలాంటి ఆర్డినెన్స్ ఎలా ఇస్తారని సుప్రీంకోర్టు సైతం ఆశ్చర్య పోవాల్సి వచ్చింది. దాంతో గవర్నర్ నిజాయితీ, విశ్వసనీయతపైనా చర్చ ప్రారంభమయింది. ఇప్పుడు మూడు రాజధానుల బిల్లు.. సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులు సరైన విధంగా ఆయన వద్దకు రాలేదనే విషయంలో మాత్రం క్లారిటీ ఉంది. మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారోనన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఒక వేళ గవర్నర్ సంతకం పెడితే.. ఆ మరుక్షణం నుంచే… రాజధాని తరలింపు ప్రక్రియ.. ఏపీ సర్కార్ ప్రారంభించడం ఖాయంగా భావించవచ్చు..!