” టెన్షన్లో నీకేమీ తెలియడం లేదు కానీ ఆల్రెడీ నీకు బుల్లెట్ దిగిపోయిందిరా ! ” అంటాడు అదుర్స్ సినిమాలో హీరో ఓ కమెడియన్‌తో. అలా చెప్పిన తర్వాత కారిపోతున్న బ్లడ్ చూసుకుని అప్పుడు నిజం తెలుసుకుంటాడు. కానీ అలా బుల్లెట్ దిగకముందు అతను చేసిన హడావుడి అంతా ఇంతా ఉండదు. ఎవడి చేతిలో తుపాకీ ఉంటే వాళ్ల వైపు హడావుడి చేస్తూంటాడు. వారు తనకు అండగా ఉన్నారనుకుంటాడు. ఇతరులపై రెచ్చిపోతాడు. కానీ చివరికి అతని నైజం ఏమిటో తెలుసు కాబట్టి.. ఎలాంటి ఫినింగ్ ఉంటుందో అలాంటి ఫినిషింగ్ ఉంటుంది. ఏపీ ప్రభుత్వ తీరు చూస్తూంటే అచ్చంగా అంతే ఉంది. కాకపోతే ఆ కమెడియన్ కన్నా ఇంకా తెలివి తేటలు చూపిస్తోంది. బుల్లెట్ దిగిపోయిందని తెలిసినా.. ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేద్దామనుకుంటోంది. ఎలాగోలా బయటపడటానికి ప్రయత్నాలుచేస్తోంది. ఆల్రెడీ బుల్లెట్ దిగిపోయిందని ప్రజలు ఓట్లు వేసి చెప్పేదాకా గుర్తించనట్లుగా నటించబోతోంది. ఎందుకంటే.. ఒక్క చాన్స్ కోసం ఓటర్లు ఇచ్చిన అధికారం మత్తు వారికి దింపలేనంతగా ఎక్కేసింది. అధికారం పోవడంతోనే అది దిగుతుంది. అలా జరగాలంటే ఎన్నికల వరకూ ఆగాల్సిందే. ఎందుకు ఇలా బుల్లెట్ దిగిపోయిందని చెప్పాల్సి వచ్చిందంటే… అధికారంలో ఉన్న పార్టీ ఏమీ చేయకూడదో అన్నీ చేయడం మన కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. కులాల మీటింగ్‌లు పెడతారు.. ప్రాంతాల గర్జనలు నిర్వహిస్తారు..ప్రతిపక్ష నేతల్ని వేధిస్తారు.. దొరికినవన్నీ తాకట్టు పెట్టేస్తారు.. ఇలా ఏ విధంగా చూసినా .. పాతాళంలోకి దిగిపోవడమే కానీ పైకి ఎదుగుతున్న లక్షణం ఒక్కటీ కనిపించడం లేదు.
పాలక పార్టీ కుల చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోందంటే అర్థం ఏమిటి ? పరిస్థితి చేయిదాటిపోయిందనే !
వైసీపీకి చెందిన కాపుల కుల మంత్రులు, నేతలు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. పవన్ కల్యాణ్ ఓ ఆదివారం పీఏసీ సమావేశం నిర్వహించుకుంటున్నారని .. ఆయన తమపై కామెంట్లు చేస్తారని .. దానికి వెంటనే కౌంటర్ ఇవ్వడానికి ఇలా తర్వాతి రోజే వారు సమావేశం కావాలని హైకమాండ్ ఆదేశించింది. దానికి వారు రాజమండ్రిని ఎంచుకున్నారు. కానీ పవన్ కల్యాణ్ వారి అంచనాలను తలగిందులు చేశారు. పీఏసీ సమావేశంలో తమ పార్టీ గురించే చర్చించుకున్నారు. అయినా సరసే ముందస్తుగా అంచనా వేసుకున్న దాని ప్రకారం రాజమండ్రిలో సమావేశం అయ్యారు. పువన్ కల్యాణ్‌పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. కాపు కులంపై అంటే జగన్మోహన్ రెడ్డికి మాత్రమే అధికారం ఉందని పవన్‌కు లేదని సర్టిఫికెట్ ఇచ్చేశారు. వారి మటుకు వారి ఆత్మగౌరవం జగన్‌కు తాకట్టు పెట్టుకోవచ్చు కానీ.. మొత్తం కులాన్ని పెట్టాలని చూడటం ఇక్కడ ఓ ట్విస్ట్ అయితే.. అసలు అందరూ ఓట్లు వేస్తే తప్ప గెలవలేమని తెలిసి కూడా ఇలా కులం పేరుతో రచ్చ రాజకీయం చేయడం వీరికి మాత్రమే సాధ్యం. అధికారంలో ఉన్న పార్టీ కుల ప్రస్తావన తీసుకు వస్తే నైతికంగా పతనమైనట్లే. అయితే నైతిక విలువలేనేవే లేనిపార్టీగా వైసీపీ మిగిలింది కాబట్టి ఆ పార్టీ నేతలు.. విచ్చలవిడిగా కులం.. కులం అని కలవరిస్తున్నారు. ఆ కులం తిండి పెట్టదని వారికీ తెలుసు. ఓట్లు తెస్తుందని ఆశ పడుతున్నారు. అందుకే అన్ని వర్గాల ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అనుభవిస్తూ కులం పేరుతో సమావేశాలు.. దూషణలు.. హెచ్చరికలు చేస్తున్నారు. ఇది వారి పతనానినికి జారుడు బల్ల పరుచుకోవడమే. చరిత్రలో జరిగింది అదే.. జరగబోయేది అదే. కానీ దరిగిన తర్వాత మాత్రమే వారికి ఈ విషయం అర్థమవుతుంది. ఎందుకంటే ముందుగా చెప్పుకున్నట్లుగా బుల్లెట్ దిగిందని.. అంతా అపోయిన తర్వాతనే తెలుస్తుంది.
పాలక పార్టీ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతోందంటే అర్థం ఏమిటి ? ఆశలొదిలేసుకుని దింపుడు కళ్లెం ప్రయత్నాలు చేసుకుందామనే !
కులమేనా.. ప్రాంతం కూడా !. అంత పెద్ద ఉత్తరప్రదేశ్‌లో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టుకుని రాజకీయంగా లాభపడాలన్న ఆలోచన అక్కడి పార్టీలకు రాలేదు. కానీ యూపీతో పోలిస్తే పది శాతం కూడా ఉండని ఏపీలో మాత్రం మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేసి రాజకీయం చేసేశారు. అధికారంలో లేనప్పుడు అన్ని ప్రాంతాల ఓట్లు కావాలి. అందుకే అసెంబ్లీలో అమరావతికి మద్దతు ప్రకటించి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేక రాజధానికి అంగీకరిస్తున్నట్లుగా ప్రకటించారు. అదే విధానం అన్ని ప్రాంతాల ప్రజలు ఓట్లు వేసే వరకూ పాటించారు. తీరా అధికారం చేతికొచ్చేశాకా.. ప్రజల మధ్య చిచ్చు పెట్టడం మినహా మరో మార్గం కనిపించలేదు. మూడు రాజధానులు అనేశారు. అటు విశాఖ అన్నారు.. ఇటు కర్నూలు అన్నారు. రాజ్యాంగపరంగా.. చట్ట పరంగా ఏదీ సాధ్యం కాదని తెలసిన తర్వాత కూడా అధికార బలంతో స్కూల్ పిల్లల జీవితాలతో ఆడుకుంటూ.. ర్యాలీలు. గర్జనలు కూడా నిర్వహిస్తున్నాయి. ఆ పార్టీ నేతల ప్రకటనలు చూస్తున్న వారికి వీరు అసలు పాలకులేనా అనే అనుమానం రాకమానదు. స్పీకర్ అనబడే గౌరవ స్థానం.. రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉన్న తమ్మినేని సీతారాం మాటలు వింటే.. మన రాజ్యాంగం ఇంత దారుణంగా నమ్మకం కోల్పోయిన పార్టీ వైఎస్ఆర్సీపీ మినహా మరొకటి ఉండేదమో అనే అనుమానం ఎవరికైనా రావడం సహజం. ఆ ధర్మాన.. తమ్మినేని ఉత్తరాంధ్రకు తిరుగులేని నాయకులుగా చలామణి అయ్యారు. ధర్మాన.. కాంగ్రెస్ హయాంలో పదేళ్లు మంత్రిగా ఉన్నారు. బొత్స కూడా అంతే. గత ఇరవై ఏళ్లలో బొత్స, ధర్మాన టీడీపీ ఉన్న ఐదేళ్లు తప్పితే..మిగతా కాలం అంతా మంత్రులుగా ఉన్నారు. మరి వారు ఉత్తరాంధ్రకు ఏం చేశారు ? ఎందుకు వెనుకబడి ఉంది. వారు ఉత్తరాంధ్రకు ఏం చేయలేరు కానీ.. వారు మాత్రం కుబేరులైపోయారు. కానీ ఇప్పుడు కూడా వారికి ఆశ చావడం లేదు. ఉత్తరాంధ్రను అడ్డం పెట్టుకుని ప్రాంతీయ విద్వేషాలకు బీజం వేస్తున్నారు. అదే పరిస్థితి కర్నూలులో హైకోర్టు పేరుతో రాయలసీమలోనూ సృష్టిస్తున్నారు. అసలు అభివృద్ధి ప్రాతిపదికగా రాజధానిని ఎంపిక చేయాలంటే.. కర్నూలును ఎంపిక చేయాలి. కానీ జరిగిందేమిటి ? అభివృద్ధి చెందిన విశాఖను రాజధానిగా చేసి.. హైకోర్టు పేరుతో ఓ బెంచ్‌ను కర్నూలులో పెట్టి అదే రాజధాని అని చెప్పి మభ్య పెట్టాలనుకుంటున్నారు. కారణం ఏదైనా ఇప్పుడు ప్రజల మధ్య అధికార పార్టీ చిచ్చు పెట్టేసింది. ప్రాంతాల మధ్య గొడవలు పెట్టేసింది. ఓ అధికార పార్టీ ఇలా చేయడం అంటే నైతికంగా కుప్ప కూలిపోయినట్లే. తర్వాత ప్రభుత్వం కూడా కూలిపోతుంది. కానీ దానికి సమయం రావాలి… ఎలాంటి సమయం అంటే.. బుల్లెట్ దిగిపోయిందిరా సామీ.. అని ప్రజలు ఓట్లేసి చెప్పే సమయం రావాల్సి ఉంది.
ప్రజలను దివాలా తీయించి.. రెండు మెతుకులు పడేస్తే దేవుడని అనుకోరు మాస్టారూ.. నిజం తెలుసుకుంటారు !
ప్రజలు పరిపాలించమని అధికారం ఇచ్చారు. తమ బతుకుల్ని బాగు చేయమని అధికారం ఇచ్చారు. అంతే కానీ.. కులం పేరుతో రచ్చ చేయమని మతం పేరుతో రాజకీయం చేసుకోమని కాదు. ప్రాంతాల పేరుతో తమ మధ్య గొడవలు పెట్టి ఓట్లు దండుకోమని కాదు. ప్రజలు అధికారం ఇచ్చింది.. గత ప్రభుత్వం కన్నా మెరుగైన పాలన చేసి.. ప్రజలకు ఉపాధి అవకాశాలు.. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి.. మెరుగైన జీవితానికి బాటలు వేస్తారని ఆశిస్తారు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది. ప్రజల ఆర్థిక స్థితిగతుల్ని కుప్పకూల్చేసింది. ఇటీవల దేశంలో ద్విచక్ర వాహనాలు ఎంత మేర అమ్ముడుబోతున్నాయన్న లెక్కలు వచ్చాయి. దేశం మొత్తం మీద సగటున 26 శాతం వాహనాల అమ్మకాలు పెరిగితే ఏపీలో ఆరు శాతం తగ్గాయి. తమిళనాడులో.. కర్ణాటకలో యాభై శాతం పెరిగాయి. కానీ ఏపీలోనే ఎందుకు తగ్గాయి. అదే సమయంలో రవాణా శాఖలో పన్నుల ఆదాయం మాత్రం నలభై శాతం పెరిగింది. అమ్మకాలు తగ్గిపోయినప్పుడు పన్నుల ఆదాయం ఎలా పెరుగుతుంది ?. అంటే ప్రజల ఆదాయంలో పన్నులే అత్యధికంగా వసూలు చేస్తున్నారని అర్థం. ఈ ఒక్క విషయంలోనే కాదు.. ప్రతీ విషయంలోనూ అంతే. మద్యం ఆదాయం పాతిక వేల కోట్లకు చేరింది. అంటే.. ప్రజల ఆదాయంలో అంత మొత్తం వసూలు చేస్తున్నారన్నమాటే. ఇక పెట్రోల్, డీజిల్.. ఆస్తిపన్ను.. చెత్తపన్ను ఇలా చెప్పుకుంటూ పోతే.. సంపాదించేది ప్రజలు.. వారి దగ్గరదోచుకునేది ప్రభుత్వం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ప్రజలు తమకు ఓట్లు వేసి అధికారం ఇచ్చింది.. వారిని దోచుకోమని లైసెన్స్ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. అనుకున్నట్లుగానే దోపిడికి పాల్పడుతున్నారు. గతంలో ప్రజా సంపదను దోచుకుని.. సహజన వనరుల్ని అడ్డగోలుగా రాయించుకుని వేల కోట్లకు పడగలెత్తారు. ఇప్పుడుఅదే చేస్తున్నారు. కానీ ప్రజలకు పంచే ఓటు బ్యాంక్ కోసం వారినే దోచుకుంటున్నారు. ఈ మాత్రం నొప్పి వారికి తెియదని అనుకుంటున్నారు. కానీ.. బుల్లెట్ దింపాల్సిన చోట దింపేశారు. బయటపడే సమయం వచ్చినప్పుడు బయటపడుతుంది. ఎందుకంటే.. ఇప్పుడు ప్రజలు దింపేశారని తెలియనంత అధికార మత్తులో పాలకులు ఉన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రజల్ని తక్కువగా అంచనా వేస్తే … మైండ్ బ్లాక్ చేస్తారు సారూ !
రాష్ట్రం ఎటు పోతే మీకేమయింది.. మీ ఇంటికి రూ. లక్ష ఇస్తున్నాం కదా అని ఇంటింటికి తిరిగి చెబుతున్నారు కానీ.. ఆ లక్షకు మించి తమ దగ్గర వసూలు చేశారన్న తత్వం ప్రజలకు బోధఫడుతోందని పాలకులు గ్రహించలేకపోతున్నారు. పోలీసులతో సహా ఇళ్ల మీదకు వెళ్లి మీకింత ఇచ్చాం.. అని బెదిరింపుగా చెబితే.. సరే సరే అనేవాళ్లు 90 మంది ఉంటారేమో కానీ.. కనీసం పది మందిఅయినా తరిగబడతారు. ఆ తిరగబడిన వాళ్లే ప్రజాభిప్రాయాన్ని ఓ మాదిరిగా అయినా చెబుతున్నారు. వారి అసహనాన్ని తట్టుకోలేక.. దాడులకు తెగబడుతున్న దారుణమైన దుస్థితి కనిపిస్తోంది. సైలెంట్‌గా ఉన్నారని రేపు… భయపడి ఓట్లేస్తారనుకుంటే.. అంతకు మించిన అమాయకత్వం ఉండదు. ప్రజాస్వామ్యంలో ప్రజలను తక్కువగా అంచనా వేస్తే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అధికారంలోకి వచ్చే వరకూ అందరికీ ప్రజలే గొప్పగా కనిపిస్తారు. కానీ అధికారం చేతికి అందిన తర్వాత ఆ ప్రజల్ని గొర్రెలుగా చూడటం ప్రారంభిస్తారు. తాము ఏది చెబితే అది నమ్మేస్తారని అనుకుంటారు. కానీ… సందర్భం వస్తే వారు ఎలా తిరగబడతారో చెప్పడం కష్టం. అనుభవించాల్సిందే. గతంలో అనుభవించిన నేతలు ఇప్పుడు షెడ్డుకెళ్లిపోయారు.
దింపుడు కళ్లెం ఆశలతో ఎన్ని బీభత్స ప్రయత్నాలు చేస్తే.. అంత మైనస్..!
ప్రస్తుత పాలక పార్టీకీ తమకు ఓటమి ఖాయమన్న ఓ నమ్మకం ఎక్కువగానే ఉన్నట్లుగానే ఉంది. బుల్లెట్ దిగందని తెలిసి కూడా.. తెలియనట్లుగా నటిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. ఏ పార్టీ అయినా తమకు అధికారం ఇచ్చారు.. ఐదేళ్లలో ఇది చేశాం.. రాష్ట్రాన్ని్ ముందుకు తీసుకెళ్లామని చెప్పి చూపించి.. ఓట్లు అడుగుతుంది. కానీ అదేమీ లేకుండా.. ప్రాంతాల మధ్య..కులాల మధ్య చిచ్చు పెట్టుకుని… ఓట్లు అడగడానికి ప్రణాళికలు వేసుకుంటోంది అంటేనే… ప్రభుత్వం ఓటమిని అంగీకరించినట్లయిందని సులువుగా అర్థం చేసుకోవచ్చు. తమ పాలనపై నమ్మకం లేక..ప్రజల్ని చీల్చేస్తే.. ఓట్లేస్తారని.. అధికారం నిలబెట్టుకోవచ్చనే ఆలోచన పొలిటికల్ దివాలా కిందకు వస్తుంది. అలా దివాలా తీసిన తర్వాత ఇక అధికారం దక్కుతుందని.. ఎలా అనుకోగలరు! ఏపీ అధికార పార్టీది ఇప్పుడిదే పరిస్థితి.