ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం సాయంత్రం ఆయన ప్రధాని మోదీతో సమావేశం అవుతారు. ఎప్పట్లాగే సమావేశ ఎజెండా పోలవరం దగ్గర్నుంచి ప్రత్యేకహోదా వరకూ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎప్పుడూ చెప్పే ఎజెండానే ఇది…కానీ అంతర్గత లక్ష్యం ఒకటి ఉంటుందని.. తక్షణం పని పడితేనే ఆయన ఢిల్లీ వెళ్తారని కొంత కాలంగా ఆయన ఢిల్లీ టూర్లనుపరిశీలిస్తే అర్థమవుతుంది. గతంలో ఆయన ఢిల్లీ పర్యటనలో ఇవన్నీ అడిగారో లేదో కానీ..బ్యాంకులకు అప్పులు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్రం ఇచ్చిన సర్క్యూలర్‌ను వెనక్కి తీసుకోవాలని కోరారు.
అప్పటికప్పుడు కొన్ని అప్పుల పర్మిషన్ తెచ్చుకున్నారు. వీటికి సంబంధించిన లేఖలు బయటకు వచ్చాయి. ఈ సారి కూడా అలాంటి అజెండా ఉందని భావిస్తున్నారు. ఎందుకంటే కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది.రాష్ట్రాలకు కొత్త అప్పలకు కేంద్రం పర్మిషన్ ఇవ్వాల్సి ఉంది. ఆ అనుమతులు ఇంకా రాలేదు. అవి రాకుండా ఆర్బీఐ దగ్గర బాండ్లు వేయడానికి కుదరదు. దీంతో సమస్యలు వస్తాయి. ఇప్పటికే వేస్ అండ్ మీన్స్ సౌకర్యాన్ని ప్రభుత్వం వాడుకుంది. ఉద్యోగులకు ఇంత వరకూ జీతాలు ఇవ్వలేదు. ఈ సమస్యల పరిష్కరానికి సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లడమే మార్గమని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
మంగళవారం పర్యటన తర్వాత ఏపీకి సంబంధించి అప్పుల కోసం ఏమైనా పర్మిషన్లు వస్తాయో లేదో చూడాలి. ఇప్పటికే శ్రీలంక పరిస్థితులు.. కేంద్రాన్ని కూడా అప్రమత్తం చేస్తున్నాయి. పలువురు ప్రధాన కార్యదర్శులు కూడా ఇదే విషయాన్ని ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఏపీకి గతంలోలా ధారాళంగా అప్పులకు అవకాశం ఇచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు.