ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గోదావరి వరదల్లో తాను చేసిన కృషికి తానే సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. పశువులకు నోరు ఉంటే అవి కూడా తనను అభినందించేవని ఆయన చెప్పుకున్నారు. వరద ప్రాంతాల పర్యటనను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఉదయం కొన్ని ప్రాంతాలకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ మాట్లాడిన ఆయన ..తమకు వరద సాయం అందలేదని ఒక్కరూ కూడా చెప్పలేదని .. అందర్నీ ప్రభుత్వం ఆదుకుందన్నారు. ప్రతి ఇంటికి రూ. రెండు వేలు.. నిత్యావసరాలు అందాయన్నారు.
పర్యటనలో ఆయన ఎక్కువగా వరదల సమయంలో ఎందుకు రాలేదో చెప్పడానికే ప్రాధాన్యం ఇచ్చారు. వరదలు వచ్చినప్పుడు తాను వస్తే అధికారులు మొత్తం తన వెంటే ఉండేవారని.. వరద బాధితుల్ని పట్టించుకునేవారు కాదన్నారు. ముఖ్యమంత్రి అంటే ఆదేశాలు మాత్రమే ఇవ్వాలన్నారు. తాను ఆదేశించానని అధికారులు పాటించారని.. వరద బాధితులంతా సుఖసంతోషాలతో ఉన్నారన్నట్లుగా జగన్ చెప్పుకొచ్చారు. వరదల్లో తాను వచ్చుంటే.. ఫోటోల్లో టీవీల్లో బాగా కనిపించేవాడినని కానీ ప్రజలకు మంచి జరగాలనే వారం రోజులు టైం ఇచ్చి వచ్చానన్నారు.
ఈ పర్యటనలో ఇళ్లు, పంటలు నష్టపోయిన వారికి జగన్ ఎలాంటి పరిహారం ప్రకటించలేదు.ఇన్పుట్ సబ్సిడీ మాత్రం ఈ ఏడాదే ఇస్తామని చెప్పుకొచ్చారు. మరో వైపు జగన్ పర్యటనలో ఎంపిక చేసిన కొంత మందితో తప్ప.. ఎవరూ కనిపించే అవకాశం లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎంపిక చేసిన వారు వచ్చి చెప్పమన్నదిచెప్పి వెళ్తున్నారు. ఇలాంటి వరద బాధిత ప్రాంతాల్లో సీఎంపర్యటన ఎవరూ ఊహించనిదన్న కామెంట్లు వినిపిస్తున్నారు. పనిలో పనిగా తన పనితీరుకు తానే కితాబిచ్చుకోవడం.. హైలెట్ అవుతోంది.