ఆంధ్రప్రదేశ్‌లో వ్యవహారాలు హద్దుదాటిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. చీఫ్ సెక్రటరీ ఎన్నికల కోడ్ పేరుతో.. సర్వాధికారిగా వ్యవహరిస్తూ… ప్రభుత్వ పెద్దల నుంచి కాకా.. బయట నుంచి వస్తున్న ఆదేశాలను పాటిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేబినెట్ నిర్ణయాలపై విమర్శలు చేయడమే కాకుండా.. ఇప్పుడు.. పేదలకు ఇచ్చే పథకాల నిధులను కూడా ఆపేస్తున్నారు. చివరికి.. సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చే రూ. 20, 30 వేల రూపాయల చెక్కులను కూడా ఆమోదించడం లేదు. బౌన్స్ అయ్యేలా చేసి.. డబ్బుల్లేవు అని సాక్షి పత్రికలో వచ్చేలా చేసుకుంటున్నారు కానీ.. ఎందుకు చెల్లించడం లేదన్న విషయాన్ని మాత్రం ప్రస్తావించడం లేదు.
మంత్రి వర్గం ఇప్పటికే ఆమోదించిన పధకాలకు నిధులు మంజూరు చేయడం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యత. రుణమాఫీ నిధులు మంజూరుకు క్యాబినేట్ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాలుగో విడత రుణమాఫీ కింద రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 9వ తేదీన రూ. 3 వేల 900కోట్ల రూపాయలను విడుదల చేయాలని ఆదేశించింది. రైతులు రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు రాష్ట్రంలో తమ రుణమాఫీ బాండ్లను తీసుకువెళ్లి బ్యాంకులలో ఇచ్చారు. పేర్లను నమోదు చేయించుకున్నారు. ఈ విధంగా పేర్లను నమోదు చేయించుకున్న రైతులకు 2వేల 200కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. కానీ నేటి వరకు ఈ డబ్బులు విడుదల కాలేదు. ప్రధాన కార్యదర్శి నుంచి ఆమోదం రాలేదని ఆర్ధిక శాఖ అధికారులు చెబుతున్నారు. పసుపు కుంకుమ, రుణమాఫీ, అన్నదాత సుఖీభవ వంటి పధకాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి యల్.వి. సుబ్రహ్మణ్యం సమీక్షించాలని నిర్ణయించారన్న ప్రచారం జరగడం… కలకలం రేపుతోంది.
ముఖ్యమంత్రి సహాయ నిధి.. చెక్కులు కూడా నిలిచిపోయాయి. సుమారు రూ. 48 కోట్ల రూపాయల మేరకు నిధులను నిలిపివేశారు. వివిధ రకాల రుగ్మతలతో ఆసుపత్రి పాలైన పేద, మధ్యతరగతి వర్గాల వారి కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆయా ఆసుపత్రుల నివేదికల ఆధారంగా నిధులు విడుదల అవుతూ ఉంటాయి. లక్షలాది మంది సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. ఈ పధకం కింద కూడా నిధులు నిలిపివేయడంతో సుమారు రూ. 48కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని చెబుతున్నారు. ఇటీవల సీ.ఎం.ఆర్.ఎఫ్ కింద ఇచ్చిన కొన్ని చెక్ లు కూడా బ్యాంకులో చెల్లుబాటు కాకపోవడం, వారు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించిన సందర్భాలు చోటు చేసుకున్నాయి. కేవలం ఆసుపత్రుల నివేదిక, లేదా బిల్లులు చూసిన తర్వాతనే సీఎం.ఆర్.ఎఫ్ నిధులను మంజూరు చేస్తారు. అయినప్పటికీ వీటి విడుదలను నిలిపివేయడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. రాజకీయ ఎజెండాతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్న అభిప్రాయాలు… ఏపీ మొత్తం ఉన్నాయి. కానీ.. సీఎస్‌కు ప్రజలతో పని లేదు. ఆయన ఎజెండా వేరు అన్న అభిప్రాయం.. టీడీపీ వర్గాల నుంచి వస్తోంది.