తెలుగుదేశం పార్టీలోకి మరో కేంద్ర మాజీ మంత్రి చేరికకు రంగం సిద్ధమయింది. ఇప్పటికే కర్నూలు జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరడానికి లైన్ క్లియర్ చేసుకున్నారు. చంద్రబాబుతో చర్చలు జరిపారు. అనుచరులకు సందేశం పంపారు. ఆయన చేరికకు ముహుర్తం ఖరారు చేసుకోవాల్సి ఉంది. ఇప్పుడు మరో మాజీ కేంద్ర మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ కూడా.. తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున కోట్ల కుటుంబంలానే… దశాబ్దాల అనుబంధం వైరిచర్ల కుటుంబానికి ఉంది. అరకు నుంచి ఐదు సార్లు లోక్‌సభ ఎంపీగా గెలిచారు. ఓ సారి రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించారు. కేంద్రమంత్రిగా కూడా పని చేశారు. కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే.. గెలవడం కష్టం కాబట్టి.. ఆయన కూడా ఇప్పుడు పార్టీ మారాలనే ఆలోచన చేస్తున్నారు. కురుపాం కోటలో ఆయన అనుచరులతో సమావేశం అయి నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న చంద్రబాబునాయుడు.. కాంగ్రెస్ నేతలను.. పార్టీలోకి తీసుకోవడంపై.. ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. అయితే.. చంద్రబాబు… రాహుల్‌తో మాట్లాడిన తర్వాతే… ఆయా నేతల్ని పార్టీలోకి తీసుకుంటున్నారని.. టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేస్తే.. తీసుకోకూడదని అనుకున్నారని.. కానీ.. టీడీపీలోకి వస్తామంటున్న నేతల అభిప్రాయాలను..మార్చేందుకు తానేమీ ప్రయత్నించనని.. వారి అవకాశాలను దెబ్బతీయాలన్న ఆలోచన కూడా తనకు లేదని.. రాహుల్.. చంద్రబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మేరకు.. కాంగ్రెస్‌లో .. పొటెన్షియల్ ఉన్న లీడర్లు ఎవరైనా వస్తారంటే.. తీసుకునేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. తమ తమ ప్రాంతంలో పట్టు ఉన్న కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ ఈ జాబితాలో ఇప్పటికే చేరిపోయారు.
అయితే… కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే.. సమస్యలు వస్తాయి కాబట్టి… కాంగ్రెస్ సీనియర్లను టీడీపీలో చేర్చుకుని.. వారికి లోక్ సభ టిక్కెట్లు ఇవ్వాలనే కొత్తపద్దతిలో .. రాహుల్, చంద్రబాబు ముందుకెళ్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీని వీడిపోయిన వారు పోగా.. కొంత మంది సీనియర్ నేతలు ఉన్నారు. పీసీసీ చీఫ్ రఘువీరా కాకుండా… .. కిషోర్ చంద్రదేవ్, పళ్లంరాజు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, చింతామోహన్ లాంటి వాళ్లు ఇంకా కాంగ్రెస్‌లో ఉన్నారు. వీరిలో కిషోర్ చంద్రదేవ్, సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఆసక్తి చూపిస్తే పళ్లం రాజు, చింతా మోహన్ మిగిలి ఉన్నారు. చింతామోహన్ సంగతేమో కానీ.. ఆసక్తి చూపిస్తే.. పళ్లంరాజును మాత్రం చంద్రబాబు కచ్చితంగా టీడీపీలో చేర్చుకుని టిక్కెట్ ఇవ్వడం ఖాయమన్న అంచనాలున్నాయి. మొత్తానికి… టీడీపీ, కాంగ్రెస్‌ల మధ్య ఇదో తరహా పొత్తని అనుకోవాలేమో..?