ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రతీ రోజూ హైకోర్టు సీరియస్ అవుతూనే ఉంది. ప్రభుత్వ నిర్ణయాలపై దాఖలైన జీవోలను సస్పెండ్ చేయడం తరచూ జరుగుతోంది. అయితే అదే సమయంలో కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు. అది అన్ని స్థాయిల్లోనూ జరుగుతోంది. అది ఒక్క హైకోర్టు విషయంలోనే.. హై ప్రోఫైల్ నిర్ణయాల విషయంలోనే కాదు.. మొత్తంగా కింది కోర్టు నుంచి పై కోర్టు వరకూ అన్ని చోట్లా… కోర్టులు ఇస్తున్న ఆదేశాలను అధికారయంత్రాంగం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. దాంతో.. అనేక మంది మళ్లీ కోర్టుల్లో .. కోర్టు ధిక్కరణ పిటిషన్లు వేస్తున్నారు. ఇలా వేసిన పిటిషన్లు ప్రస్తుతం వివిధ కోర్టుల్లో దాదాపుగా ఎనిమిది వేల వరకూ ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ ఇటీవల తరచూ కోర్టు ధిక్కరణ కేసుల్లో హైకోర్టుకు హాజరవ్వాల్సి వస్తోంది. దీంతో ఆయన అసహనానికి గురవుతున్నారు. అధికారులతో స్పందన సమీక్షలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతను అద్దం పడుడుతున్నాయి. కోర్టు ధిక్కరణ కేసుల్లో తక్షణం స్పందించి.. హైకోర్టుకు వివరణ ఇవ్వడం.. కౌంటర్ దాఖలు చేయడం చేయాలని… ఆయన స్పష్టం చేశారు. అసలు కోర్టులను పట్టించుకోకపోవడం వల్ల పదే పదే హాజరవ్వాలని ఆదేశాలు వస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమీక్షలో పాల్గొన్న న్యాయశాఖ అధికారులు మొత్తం ఏపీ సర్కార్‌పై పెండింగ్‌లో ఉన్న ధిక్కరణ పిటిషన్ల గురించి చెప్పారు. ఎనిమిది వేల వరకూ ఉన్నాయని చెప్పారు. దీంతో నోరెళ్లబెట్టడం ఇతర అధికారుల వంతయింది.
ఏ ప్రభుత్వం అయినా కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నా… కోర్టు తీర్పును అమలు చేయకపోయినా.. బాధితులు ధిక్కార పిటిషన్ వేయవచ్చు. గతంలో ప్రభుత్వాలు.. కోర్టులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవి. కోర్టు తీర్పులు ఏమైనా సరే .. ఉల్లంఘించడానికి అసలు సాహసించేవి కావు. అధికారుల నిర్లక్ష్యం వల్ల కొన్ని జరిగినా పరిమితంగానే కోర్టు ధిక్కారణ పిటిషన్లు దాఖలయ్యేవి. కానీ ఈ ప్రభుత్వం న్యాయవ్యవస్థ విషయంలో వ్యవహరిస్తున్న తీరు .. అధికారులపైనా ప్రభావాన్ని చూపించినట్లుగా ఉంది. ఆ వ్యవస్థను పట్టిచుకోకపోయినా ఏమీ కాదని.. వారు ప్రతీ ఆదేశాన్ని లైట్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగానే పెద్ద ఎత్తున కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయినట్లుగా భావిస్తున్నారు.
కోర్టు ధిక్కరణను ఏ కోర్టు అయినా సీరియస్‌గా తీసుకుటుంది. తమ ఉత్తర్వులకే విలువ లేకపోతే.. వ్యవస్థ ప్రాధాన్యం తగ్గిపోతుంది. అందుకే… హైకోర్టు కూడా… కోర్టు ధిక్కరణపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఇద్దరు అధికారులకు శిక్ష విధించింది. ఏ మాత్రం కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా తేలినా కేసులు నమోదుకు ఆదేశిస్తోంది. ఇప్పటి వరకూ పెద్ద సంఖ్యలోఅధికారులపై కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయి. సోమవారం కూడా.. స్కూళ్లలో గ్రామ సచివాలయాల నిర్మాణంపై తాము ఇచ్చిన ఆదేశాలు పట్టించుకోలేదని ముగ్గురిపై కోర్టు ధిక్కరణ చర్యలకు ఆదేశించింది హైకోర్టు. ఈ పరంపరం ముందు ముందు పెరుగుతుందో.. లేకపోతే.. కోర్టులను న్యాయవ్యవస్థను గౌరవించడం ప్రారంభిస్తారో వేచి చూడాలి..!