వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై సెలక్ట్ కమిటీ నియామకానికి ప్రభుత్వం అడ్డు పుల్ల వేస్తోంది. మండలి చైర్మన్ ఆదేశాలు పాటించవద్దన్న ఒత్తిడి వస్తూండటంతో.. ఆయన కూడా.. సైలెంటయిపోయారు. సెలెక్ట్ కమిటీని నియమించాలని.. అందుకోసం ప్రక్రియను ప్రారంభించాలని మండలి కార్యదర్శిని చైర్మన్ షరీఫ్.. వారం రోజుల కిందట ఆదేశించారు. కానీ ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వారం రోజుల్లో ప్రక్రియను పూర్తిచేయాలని గతంలో ఆదేశించినప్పటికీ మండలి కార్యదర్శి పూర్తి చేయకపోవడంపై ఆయన అసహనంతో ఉన్నారని చెబుతున్నారు.
ఈ లోపు టీడీపీ … తమ పార్టీ తరపున ఎవరెవరు సెలక్ట్ కమిటీలో ఉంటారో.. చెబుతూ.. ఓ జాబితాను చైర్మన్ ఆఫీసులో ఇచ్చింది. ఇప్పుడు బీజేపీ, పీడీఎఫ్ కూడా సెలెక్ట్ కమిటీలో ప్రాతినిధ్యం వహించే తమ సభ్యుల పేర్లను సూచిస్తూ లేఖలు పంపాయి. దీంతో శాసనమండలిలోని మెజార్టీ పక్షాలు సెలెక్ట్ కమిటీలో ప్రాతినిధ్యం వహించేందుకు లేఖలు పంపినట్లయింది. ఇప్పుడు చైర్మన్ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. సోమవారం శాసనమండలి చైర్మన్ షరీఫ్ కార్యాలయానికి వెళ్లనున్నారు.
మూడుపక్షాలు ఇప్పటికే పేర్లు పంపడం, అధికార వైసీపీ నుంచి అధికారులపై ఒత్తిడి పెరగడంతోపాటు మండలి చైర్మన్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నదానిపై ఆసక్తి ఏర్పడింది. శాసనమండలి చైర్మన్ షరీఫ్ సోమవారంకార్యాలయానికి వెళ్లిన తర్వాత ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశముంది. ఫైల్ ను వెనక్కి తెప్పించుకొని తనవద్దకు వచ్చిన పేర్ల జాబితాతో కమిటీని నియమించి ఉత్తర్వులు జారీచేసే అవకాశముందని అంటున్నారు.