ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ దాడులు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత సహజంగా కొన్ని ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయి. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తే సద్దుమణిగిపోతాయి. కానీ.. చూసీ చూడనట్లు వ్యవహరిస్తే మాత్రం.. అవి వర్గ పోరాటాలకు దారి తీస్తాయి. ప్రస్తుతం ఏపీలో అదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామాల్లో చిచ్చు పెరిగి పెద్దదయితే… వాటిని ఆర్పడం అంత తేలికగా సాధ్యమయ్యే పని కాదు. కొద్దిరోజులుగా.. దాడులకు మించిన ఘటనలు జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా రుద్రమాంబపురంలో ఓ టీడీపీ సానుభూతిపరురాలిపై దాడి చేసి వివస్త్రను చేసిన ఘటనలో బాధితురాలు మృతిచెందింది. దాడిలో మృతిచెందిందని బంధువులు ఆరోపిస్తే… మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకే.. గుంటూరు జిల్లా మంగళగిరిలో హత్య జరిగింది. టీడీపీ నేత తాడిబోయిన ఉమాయాదవ్..మంగళవారం రాత్రి దారుణహత్యకు గురయ్యారు. ఇంటి సమీపంలోనే ఉమాయాదవ్‌ను కత్తులు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా నరికి హతమార్చారు. నిందితులైన వైసీపీ నేతలు పోలీసులకు లొంగిపోయారు.
టీడీపీ కార్యకర్తల కుటుంబాలపై దాడులు, హత్యలు, ఆస్తులు ధ్వంసాలపై పార్టీ నేతలు సీరియస్‌గా స్పందిస్తున్నారు. చంద్రబాబు నివాసంలో సమావేశమైన నేతలు.. దాడులపై తీవ్రంగా చర్చించారు. చంద్రబాబు కుటుంబసభ్యులకు భద్రత తగ్గింపును నిరసించారు. 130 మంది కార్యకర్తలపై దాడులు జరిగాయని, పలు చోట్ల ఆస్తులు ధ్వంసం చేశారని….దీనికి సంబంధించిన నివేదికను తయారుచేశారు. కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, చంద్రబాబు కుటుంబసభ్యుల భద్రత కుదింపును నిరసిస్తూ…డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఫిర్యాదుచేయాలని టీడీపీ నేతలు నిర్ణయించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని టీడీపీ మండి పడుతోంది. ఏపీలో బీహార్ తరహా పాలన నడుస్తోందని విమర్శలు ప్రారంఁభించింది. ఇప్పటివరకు టీడీపీకి చెందిన ఆరుగురు కార్యకర్తలను హత్యచేశారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ నీతులు చెబుతూ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు. వీటిని రాజకీయంగా చూస్తే.. ముందు ముందు.. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని… చెలరేగిపోయేవారు ఎక్కువగా ఉంటారు. అది అంతిమంగా శాంతిభద్రతల సమస్యకు దారి తీస్తుందనే ఆందోళన ఉంది.