ఆంధ్రప్రదేశ్లో నేడు కొత్త ప్రభుత్వం కొలువుదీరుతోంది. సాధారణంగా ప్రభుత్వాలు మారేటప్పుడు ఉత్సాహం ఉంటుంది. అధికారం తమ చేతుల్లోకి వస్తుందని ఆయా పార్టీల నేతలు సంతృప్తిగా ఉంటారు. కానీ ఏపీలో అధికారం చేపట్టే కూటమి నేతలు అంత సంతృప్తి కన్నా అసలైన బాధ్యతల బరువు ఎక్కువగా ఉండనుంది. దీనికి కారణం ఐదేళ్ల పాటు జరిగిన విధ్వంసం. ఆదాయ వనరుల అడ్డగోలు దోపిడి. వీటిని సరి చేసుకుంటూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకుంటూ ముందుకు సాగాల్సిన బాధ్యతలు ఉన్నాయి.
నిర్మాణాత్మకంగా పరిపాలన
కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా గతప్రభుత్వం కలెక్టర్ల సమావేశం పెట్టిన ప్రజావేదికను కూల్చేసి పాలన మొదలు పెట్టింది. ఐదేళ్ల పాటు ఆ కూల్చివేతలు సాగాయి. కొన్ని స్వయంగా .. కొన్ని నిర్లక్ష్యంతో కూలిపోయాయి. ఇప్పుడు వాటన్నింటినీ నిలబెట్టి… నిర్మాణాత్మక పరిపాలన చేయాల్సిన అవసరం ఏర్పడింది. ప్రజలు విధ్వంస పాలన.. అరాచక పాలన భరించలేక వైసీపీని తుడిచి పెట్టేసి కూటమికి అధికారం ఇచ్చారు. వారి ఆశల్ని నెరవేర్చాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉంది.
అమరావతి, పోలవరం పూర్తి ప్రధానం
ఏపీ అంటే అమరావతి, పోలవరం అనే నినాదం గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చారు. ఇప్పుడు ఆ నినాదాన్ని నిజం చేయాల్సి ఉంది. తొలి ఐదేళ్లలో వీలైనంత ముందుకు తీసుకెళ్లారు కానీ పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు పూర్తి చేయడానికి ఎలాంటి ఆటంకాలు లేవు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే పరిస్థితుల్లో ఉన్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు. దాన్ని ఎంత వేగంగా ముందుకు తీసుకెళ్తే ఏపీ అంతగా అభివృద్ధి చెందుతుంది. ఈ విషయంలో ప్రభుత్వంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.
సంతృప్త స్థాయిలో సంక్షేమమూ కీలకమే
సంతృప్త స్థాయిలో సంక్షేమం అందించడం కీలకం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సి ఉంది. ఫ్రీబస్, మూడు ఉచిత సిలిండర్లు వంటి వాటికోసం మహిళలు పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. ఆరు నెలల్లో హామీల అమలు ప్రయోజనాలు పేదలకు చేరిస్తే… సమర్థంగా పరిపాలన ప్రారంభించినట్లే. అయితే గత ప్రభుత్వం చేసిన నిర్వాకాలు, అప్పుల వల్ల… పాలన అంత సాఫీగా సాగే అవకాశం లేదు. కానీ చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో.. ప్రజలు రాష్ట్రం గాడిన పడుతుందన్న నమ్మకంతో ఉన్నారు. వారు చేసి చూపిస్తారని భావిస్తున్నారు.
కొత్త ప్రభుత్వానికి తెలుగు 360 తరపున ఆల్ ది బెస్ట్.