భారీ స్థాయి మెట్రో సిటీలు లేకపోయినా ఏపీలో విమాన ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. గత ఆరు నెలల కాలంలో అన్ని ఎయిర్ పోర్టుల్లోనూ దాదాపుగా యాభై శాతం ప్యాసింజర్లు పెరిగినట్లుగా రికార్డులు వెలుగులోకి వచ్చాయి. కూటమి ప్రభుత్వం రావడంతో ఏపీలో వ్యాపార వ్యవహారాలు పెరిగాయి. అభివృద్ధి పనులు, పెట్టుబడుల కోసం వచ్చే వారు ఎక్కువగా ఉండటంతో పాటు.. వివిధ రకాల కార్యకలాపాలు ఊపందుకోవడంతో.. ఎయిర్ పోర్టులు బిజీగా మారుతున్నాయి.
2014-19 మధ్య విజయవాడ విమానాశ్రయం అత్యంత రద్దీగా ఉండేది. ఓ దశలో మిలియన్ మార్క్ ను అందుకుంది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక అది జగన్ అండ్ కో కు ప్రైవేటు ఎయిర్ పోర్టులా మారిపోయింది. విమానాల రాకపోకలు అరవై శాతం తగ్గిపోయాయి. మళ్లీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎయిర్ పోర్టులో హడావుడి కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో విజయవాడ ఎయిర్ పోర్టులో ఇప్పటికే మిలియన్ మార్క్ ను అందుకుంది. ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి ఆల్ టైమ్ రికార్డు నమోదవుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూలై నెల నుంచి విమాన ప్రయాణాలు పెరిగాయి. డిసెంబరులోనే 47 శాతం ట్రాఫిక్ పెరిగింది.
విశాఖ విమానాశ్రయానికి డిమాండ్ పెరుగుతోంది. నలభై శాతం వరకూ ప్రయాణికుల సంఖ్య పెరిగింది. రాజమండ్రి , తిరుపతి ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులు రెట్టింపు అయ్యారు. కర్నూలు ఎయిర్ పోర్టుకు మాత్రం అంతగా ఆదరణ ఉండటం లేదు. గత ఆరు నెలల కాలంలో పదిహేను వందల మంది మాత్రమే ప్రయాణించారు. కడప ఎయిర్ పోర్టు ప్రవేటు అవసరాలకు వినియోగిస్తున్నారు.