ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల విభజన సస్పెన్స్‌లో పడింది. జనాభా లెక్కలే దీనికి కారణం. కరోనా కారణంగా జనాభా లెక్కల ప్రక్రియ పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. పూర్తి కాలేదు అందుకే రికార్డులు సిద్ధం కాలేదు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం.. కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలన్న పట్టదలతో ఉంది. గతంలో ఉగాది కల్లా.. కొత్త జిల్లాల ప్రకటన ఉంటుందని ప్రభుత్వ వర్గాలు ప్రచారం చేశాయి. కానీ ఇప్పుడు ఉగాది ముంచుకొస్తున్నా అలాంటి ఆలోచన లేదు. సీఎస్ నేతృత్వంలోనికమిటీ… రెండు, మూడు సార్లు సమావేశమైంది. జిల్లాల వారీగా కమిటీలు పని చేస్తున్నాయి. దీంతో జిల్లాల విభజనకు సంబంధించిన కసరత్తు దాదాపుగా పూర్తయింది. ప్రకటన చేస్తే సరిపోతుంది. కానీ ఏపీ ప్రభుత్వం ఎందుకో కానీ.. పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.
జిల్లాల విభజన ప్రక్రియ చేపట్టినప్పుడు.. చాలా డిమాండ్లు వచ్చాయి. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాలను విభజించడం అనేది వైసీపీ విదానం. దాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టారు. కానీ నిజం ఆ ప్రకారం విభజిస్తే అనేక రకాల సమస్యలు వస్తాయి. ఆ విషయం ప్రక్రియ ప్రారంభించిన వెంటనే ప్రభుత్వానికి తెలిసింది. శ్రీకాకుళం జిల్లాలో అధికార పార్టీ నేతలే జిల్లాలను విభజిస్తే పార్టీ మట్టికొట్టుకుపోతుందని శాపనార్ధాలు పెట్టారు. ఇతర చోట్ల బహిరంగంగా అలాంటివి వినిపించకపోయినా… జిల్లాల విభజన రాజకీయంగా ఆత్మహత్యా సదృశం అవుతుందన్న ఫీడ్ బ్యాక్ రావడంతో స్లో అయ్యారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
నిజానికి జిల్లాల విభజన చేపట్టాలనుకుంటే ప్రభుత్వానికి ఇప్పటికీ అడ్డంకి కాదు. ఏదో ఓ మార్గంలో జిల్లాలను ఏర్పాటు చేసేస్తుంది. ఇప్పటి వరకూ ఏపీ సర్కార్.. ఎలాంటి ఆటంకాలు తమకు ఉన్నాయని.. ఏ విషయంలోనూ అనుకోలేదు. ఈ విషయలోనూ అనుకోదు కూడా. తర్వాత న్యాయస్థానాల్లో ఏమైనా ఇబ్బందులొస్తే అక్కడ చూసుకుంటామని అనుకుంటుంది కానీ వెనుకడుగు వేయదు. ఇప్పుడు కూడా అదే జరిగిందని చెబుతున్నారు. ప్రభుత్వ వర్గాల నుంచి ఏడాది..ఏడాదిన్నర పట్టవచ్చని చెబుతున్నారు. ఆ తర్వాత ఎన్నికల హడావుడి ప్రారంభమవుతుంది. అలాంటి సమయంలో… జిల్లాల విభజన లాంటి రిస్క్ ప్రభుత్వం తీసుకోదని అంటున్నారు. మొత్తానికి జిల్లాల విభజన రాజకీయ లాభనష్టాల చట్రంలో ఇరుక్కుంది. అది ఎప్పటికి జరుగుతుందో చెప్పడం కష్టమే.