ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో తేల్చాల్సిన ఆస్తుల విభజన ఇంత వరకూ తేలలేదు. రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోవాలని వివాదం వస్తే కేంద్రం పరిష్కరించాలని విభజన చట్టంలో ఉంది. ఈ వివాదాల పరిష్కారానికి గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి. అన్నింటినీ జనాభా ప్రాతపదికన పంచుకునేందుకు గత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఉన్నత విద్యామండలి నిధుల విషయంలో హైకోర్టుకు వెళ్లి అనుకూల ఫలితం సాధించింది. ఆ తర్వాత అప్పటి గవర్నర్ నరసింహన్ నేతృత్వంలో పలు సమావేశాలు జరిగాయి. కానీ ఆయన అప్పట్లో సచివాలయ భవనాలను తెలంగాణకు అప్పగిస్తే చాలు.. ఇతర విషయాలు ఏమీ అక్కర్లేదన్నట్లుగా వ్యవహరించడంతో టీడీపీ ప్రభుత్వం ఆయన తీరును బహిరంగంగానే ఖండించింది. కానీ సమస్యలు పరిష్కారం కాలేదు.
సచివాలయ భవనాలు అప్పగింతతో ప్రారంభం… అన్నీ సమర్పించుకున్నట్లే !
ప్రభుత్వం మారిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయక ముందే సీఎం జగన్ .. సచివాలయ భవనాలను తెలంగాణ సర్కార్కు అప్పగించేశారు. అప్పట్నుంచి విభజన ప్రకారం ఏపీకి రావాల్సిన ఒక్క ప్రయోజనం.. ఆస్తి రాలేదు. వివాదాలు అలాగే ఉన్నాయి. కేంద్రం తూ..తూ మంత్రం సమావేశాలు పెడుతోంది.ఆ సమావేశాల్లోనూ ఏపీ బలమైన వాదనలు వినిపించకపోవడం చాలా చేటు చేస్తోంద. తాజాగా నిర్వహించిన సమావేశంలోనూ అదే పరిస్థితి. నిధులు, ఆస్తులు ఉన్న సంస్థల విభజనకు తెలంగాణ అంగీకరించలేదు. ఏపీ బలమైన వాదన వినిపించలేదు. ఉన్నత విద్యామండలి విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు అన్ని సంస్థలకు వర్తిస్తుంది. కానీ ఈ చొరవ చూపి రాష్ట్రానికి రావాల్సిన వాటిని రాబట్టడంలో మాత్రం ఏపీ ప్రభుత్వం విఫలమవుతోంది.
ప్రకటించిన రైల్వే జోన్ నూ తెచ్చుకోలేని నిస్సహాయత !
ఏపీ ప్రభుత్వ నిష్క్రియా పరత్వం ఎంత దారుణంగా ఉందంటే .. దాదాపుగా ఐదేళ్ల కిందట ఎన్నికలకు ముందు కేంద్ర కేబినెట్ విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ అతీ గతీ లేదు. కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు రైల్వే బోర్డు విశాఖ రైల్వే జోన్ లాభదాయకం కాదని ఆపేశామని చెబుతోంది. కానీ కనీసం ఖండించి.. మా రైల్వే జోన్ మాకివ్వాల్సిందేనని ఒక్క మాట కూడా అడగలేని పరిస్థితి. ఇప్పటి వరకూ రావాల్సిన వాటిని సాధించలేదు.. సరి కదా వచ్చిన వాటినీ తెచ్చుకోలేని నిస్సహాయతలో ఏపీ ప్రభుత్వం పడిపోయింది.
ఉమ్మడి ఆస్తులు మొత్తం ఇక తెలంగాణకేనా !?
కొన్ని లక్షల కోట్ల ఆస్తులు తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సి ఉందన్న వాదన వినిపిస్తోంది. కానీ ఏపీ ప్రభుత్వం … మా సొమ్ము కాదు కదా అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ప్రజల సొమ్ముపై … పట్టింపు లేనట్లుగా వ్యవహరించడం.. ప్రభుత్వ ఆస్తులు ఎటుపోతే మాకేంటే అనుకునే పాలకుల నైజం కారణంగా ఏపీ దారణంగా నష్టపోతోంది. ఈ ప్రభావం ప్రజలపై పడటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వం తీరు మారకపోతే.. ఉమ్మడి ఆస్తులు మొత్తం తెలంగాణ పరమవుతాయన్న ఆందోళన ఏపీలో వ్యక్తమవుతోంది.