ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం పడ్డ బకాయి ఏకంగా 21వేల కోట్ల రూపాయలు. వారి జీతం నుంచి వివిధ రకాలకు గా కట్ చేసుకున్న మొత్తాన్ని ప్రభుత్వం వాడుకుంది. వారికి కల్పించాల్సిన ప్రయోజనాలను తొక్కి పట్టేసింది. చివరికి పిల్లల పెళ్లిళ్లకూ డబ్బులు ఇవ్వకుండా బయట అప్పులు చేసుకునేలా ప్రోత్సహించింది. గత ఐదేళ్లుగా ఉద్యోగులకు ఇలాంటి ట్రీట్మెంట్లు జగన్ రెడ్డి ఎన్ని ఇచ్చాడో లెక్కలేదు.
కానీ పోరాడితే కేసులు పెడతారన్న భయంతోనే.. వ్యక్తిగత ప్రయోజనాలు కల్పించుకునే లక్ష్యంతోనే ఉద్యోగ సంఘం నేతలు ప్రభుత్వానికి సరెండర్ అయిపోయారు. డిమాండ్లు చేయలేదు. టీచర్లు ఓ సారి రోడ్డెక్కి ప్రభుత్వాన్ని వణుకుపుట్టిస్తూ.. ప్రభుత్వానికి అమ్ముడుపోయి.. వారినీ మోసం చేశారు. ఇరవై ఒక్క వేల కోట్ల బకాయిలు ఉన్నా… బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వంటి వాళ్లు ప్రభుత్వాన్ని పొగుడుతూ.. తమ పబ్బం కానిచ్చుకున్నారు. చివరికి వైసీపీ రాజకీయ వ్యూహాల్లో భాగమని .. రాజ్యాంగ వ్యవస్థ అయిన ఎస్ఈసీపైనా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు.
ఇప్పుడు ఎన్నికలకు ముందు తమకు ఇరవై ఎక్క వేల కోట్లు రావాలంటూ… చర్చలు ప్రారంభించారు. జగన్ రెడ్డి ఇప్పటికే ఆస్తుల్ని.. ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి దివాలా అంచుకు రాష్ట్రాన్ని చేర్చారు. ఉద్యోగులు రిటైర్మెంట్ డబ్బులివ్వలేక.. రెండేళ్లు వయసు పెంచారు. ఇప్పుడు రిటైర్మెంట్లకు డబ్బులు ఇవ్వలేకపోతున్నారు. ఇదంతా ఎదురుగా కనిపించే నిజం. ఈ ప్రభుత్వం ఉద్యోగులకు వారి డబ్బులు కూడా వారికి ఇవ్వదు. ఐదేళ్లు అడగకపోవడం వల్ల మారే ప్రభుత్వంలోనూ గట్టిగా అడగలేని దౌర్భాగ్య పరిస్థితిని ఉద్యోగులకు ఉద్యోగ సంఘ నేతలు తెచ్చారు.
ఉద్యోగులకు ఉద్యోగ సంఘ నేతలు చేసినంత నష్టం ప్రభుత్వం కూడా చేయలేదు. పోరాడే ఓ గొప్ప లక్షణాన్ని జగన్ రెడ్డికి తాకట్టు పెట్టేశారు. ఇక ఎప్పటికీ ఉద్యోగ సంఘాలు పోరాడలేని పరిస్థితికి తెచ్చారు.