ఆంధ్రప్రదేశ్‌లో ఓ మిలియన్ మార్చ్ జరగబోతోంది. సెప్టెంబర్ ఒకటో తేదీన నిర్వహించనున్నారు. అయితే ఇది సాధారణ ప్రజలు చేస్తున్న మార్చ్ కాదు. సీపీఎస్ ఉద్యోగులు. టీచర్లు చేస్తున్న మార్చ్. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్.. అలా చేయకపోగా అవగాహన లేకుండా హామీ ఇచ్చానని చెబుతున్నారు. దీంతో ప్రభుత్వంపై పోరుబాటే ఖాయమని ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. సీపీఎస్ ఉద్యోగులు.. ముఖ్యంగా టీచర్లు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
వారంతా సెప్టెంబర్ ఒకటో తేదీన మిలియన్ మార్చ్ నిర్వహించి ప్రభుత్వంపై తమ అసంతృప్తిని తెలియచేయాలని నిర్ణయించుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలకు సహజంగానే ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వలేదని టీచర్లు ఆగిపోరు. గతంలో చలో విజయవాడను టీచర్లే విజయవంతం చేశారని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. పీఆర్సీ విషయంలో మోసం.. జీతాలు తగ్గించడం.. సీపీఎస్ రద్దు సహా అనేక అంశాల్లో ఉద్యోగులు అసంతృప్తిలో ఉన్నారు.
ఉద్యోగ సంఘ నేతలు మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు. ఏదో ఓ చిన్న మేలు చేశారని చెప్పి పాలాభిషేకాలు చేస్తారు కానీ.. ఉద్యోగులకు కీలకంగా మారిన సమస్యల పరిష్కారం విషయంలో మాత్రం స్పందించడం లేదు. ఇప్పుడు ఉద్యోగులు రోడ్డెక్కితే పరిస్థితి తీవ్రంగా మారుతుంది. వారు మిలియన్ మార్చ్‌ను సక్సెస్ చేస్తే.. మిగిలిన వర్గాలు కూడా.. దైర్యం కూడగట్టుకునే అవకాశం ఉంది. అందుకే.. మిలియన్ మార్చ్‌ను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.