ఏపీలో విద్యుత్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు . మంగళవారం చలో విజయవాడకు పిలుపునివ్వడంతో ప్రభుత్వం కంగారు పడుతోంది. తర్వాత సమ్మెకు కూడ వెళ్లబోతున్నారు. వారిపై ఎస్మా ప్రయోగిస్తామని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. అదే సమయంలో… విద్యుత్ ఉద్యోగులపై విజిలెన్స్ ను ప్రయోగిస్తోంది. విద్యుత్ సంఘ నేతలపై.. ఉద్యోగ సంఘం నేతలపై పోలీసుల్ని ప్రయోగించినట్లుగా అక్కడ విజిలెన్స్ ను ఉపయోగించుకుంటున్నారు. విద్యుత్ ఉద్యోగ సంఘ నేతల రికార్డులన్నీతిరగేస్తున్నట్లుగా తెలుస్తోంది. వారిలో కొంత మందిపై కేసులు పెట్టి ఉంటారని … అరెస్టులు చేసే అవకాశం ఉందన్న ప్రచారం ఉంది. ఇలా కేసులకు గురైన ఏపీ ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ ఇప్పటికీ ఆజ్ఞాతంలోనే ఉన్నారు.
ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించిదేమీ లేకపోగా చట్ట ప్రకారం రావాల్సిన వాటినీ ఇవ్వడం లేదు. విద్యుత్ ఉద్యోగులు ట్రాన్స్ కో, జెన్ కో కార్పొరేషన్ల కింద ఉంటారు. వారికి ప్రత్యేకమైన పీఆర్సీ, ఇతర ప్రయోజనాలు కల్పించాలి. గతంలో ప్రభుత్వాలు వాటి విషయంలో ఉద్యోగలకు న్యాయం చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు హయాంలో 1998లో విద్యుత్ రంగంలో సంస్కరణల అమలు చేశారు. అప్పటి ఒప్పందాలను బట్టి తర్వాత ఆరుసార్లు వేతన సవరణ జరిగింది. దీని ప్రకారం తగ్గించిన ఫిట్మెంట్తో పాటు ఏడాదికి మూడు వంతున ఒక్కో ఉద్యోగికి 18 ప్రత్యేక ఇంక్రిమెంట్లు వచ్చాయి.
చివరగా 2018 మే 31న జరిగిన వేతన ఒప్పందం 2022 మార్చి 31 వరకూ అమల్లో ఉంది. ఈ ఒప్పందం కారణంగా సుదీర్ఘ సర్వీస్ ఉన్న స్వీపర్‌కు కూడా రూ. లక్ష వరకూ జీతం అందుకుంటున్న వారు ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం.. ఆ జీతాలను తగ్గించాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. విద్యుత్ సంస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగి పదవీవిరమణ ప్రయోజనాల్లో కనీసం రూ.30-40 లక్షలు నష్టపోయే అవకాశం ఉంది. వచ్చే పింఛను భారీగా తగ్గుతుంది. విద్యుత్ సంస్థల సిబ్బంది పే స్కేల్లో మార్పులు, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే నిబంధనలను అమలుచేసేందుకు దాదాపుగా నిర్ణయం తీసుకుంది. అందుకే ఉద్యోగులు సమ్మెకు సైతం వెనుకాడటం లేదు. ఇప్పుడు వారిపై కేసుల వ్యూహమే అవలంభించబోతున్నారు. మరి వారు తగ్గుతారా .. పోరాడుతారా అన్నదే కీలకం.