ఆంధ్రప్రదేశ్‌లో.. ఇరవై ఏళ్ల అనుభవం ఉన్న ఐఏఎస్ అధికారికి వచ్చే జీతం, అలవెన్సులు.. అన్నీ కలిపి వచ్చే జీతం.. రూ. రెండు లక్షల లోపు. కానీ ఐఏఎస్‌లు కాకుండా.. ప్రభుత్వ పెద్దల దగ్గర ప్రాపకం సంపాదించి.. వారి టీముల్లో ఓ ఉద్యోగిగా చేరిపోతే… వచ్చే జీతం, అలవెన్సులు.. అంతకు రెండింతలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… పదవీ స్వీకారం చేయగానే.. తన ఓఎస్డీగా.. కృష్ణమోహన్ రెడ్డిని నియమించుకున్నారు. ఈయన రిటైర్డ్ గ్రూప్ వన్ అధికారి మాత్రమే. అలాగే.. ఇరగవరపు అవినాష్ అనే వ్యక్తిని ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ టు సీఎం పోస్టులో నియమించుకున్నారు. ఈయన అంతకు ఏ ప్రభుత్వ ఉద్యోగమూ చేయలేదు. వైసీపీకి.. రాజకీయ ప్రచార వ్యూహాల్లో సహకారం అందించారట. పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా అట. వీరిద్దరికి జీతభత్యాలు.. ఆరున్నర లక్షల రూపాయలు. ఇవి మాత్రమే కాదు.. వీరిద్దరికి స్టాఫ్ కూడా. అందులో.. ఐపీఎస్ అధికారి కూడా ఉంటారు.
నెలల్లోనే వాళ్లకు జీతాలు రెట్టింపు చేశారా..?
ఇరగవరపు అవినాష్, కృష్ణమోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి వ్యక్తిగత వ్యవహారాలు ప్రధానంగా చూస్తారు. అధికార విధుల్లో జోక్యం దాదాపుగా ఉండదు. ఎందుకంటే.. అధికార పరంగా.. జగన్మోహన్ రెడ్డికి సీఎంవో ఉంటుంది. అందులో.. చాలా పెద్ద టీమే ఉంటుంది. వారు కాకుండా.. అదనంగా.. మరికొంత మందిని నియమించుకున్నారు. దాదాపుగా ఓ పది మందితో.. టీం ఉంది. ఆ టీంలో… ఇరగవరపు అవినాష్, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు. ఇప్పుడు వీరిద్దరి జీతభత్యాల గురించే ప్రత్యేకంగా జీవో జారీ చేశారు. దానికి వేరే కారణం ఉంది. గతంలో.. తక్కువగా.. వీరి జీతభత్యాలను నిర్ణయించినట్లుగా ఉన్నారు. కానీ బయటకు రాలేదు. దీనిపై వారిని సంతృప్తి పరచడానికి రివైజ్ చేసి.. కొత్త జీవో జారీ చేశారు. అందులో.. లక్షల్లో జీతభత్యాలు కల్పించి సంతృప్తి పరిచినట్లుగా కనిపిస్తోంది. మిగిలిన వారికి.. ఎవరెవరికి ఎంతెంత ఇస్తున్నారో… కొన్ని జీవోలు రహస్యంగా ఉండిపోయాయి.
సలహాదారులు.. ఇతర నియామకాలకు ఎంతెంత…?
నిజానికి ఏపీ సర్కార్.. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయక సిబ్బంది విషయంలోనే కాదు.. ఇతర నియామకాల విషయంలోనూ.. జీతభత్యాల లక్షకు తగ్గకుండా ఉండేలా చూసుకుంటోంది. సలహాదారులకు ఎంత జీతభత్యాలనేది.. బయటకు రాలేదు కానీ… లక్షల్లోనే ఉండటం ఖాయం. ఇప్పటికే దాదాపుగా.. పదిహేను మందికిపైగా సలహాదారులు నియమితులయ్యారు. సీపీఆర్వోను నియమించారు. ఈ నియామకాలు జరిగినప్పుడు.. జీతభత్యాలు.. ఇతర అంశాలపై విడిగా ఆదేశాలు జారీ చేస్తారని చెప్పారు. అవి జారీ చేశారు.. కానీ అవన్నీ ఇంటర్నల్ ఆదేశాలుగా ఉండిపోయాయి. బయటకు రాలేదు. కానీ.. ఏ ఒక్కరికి కూడా.. రూ. లక్ష కంటే తక్కువ జీతం నిర్ధారించలేదని.. వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
సీఎం జీతం రూపాయి.. అందరికీ లక్షల్లో..!
ఈ నియామకాల్లోనే కాదు.. ఇతర పదవుల్లో.. సొంత పార్టీ ప్రజాప్రతినిధుకు ఇచ్చే అలవెన్సుల్లోనూ ఏ మాత్రం.. వెనక్కి తగ్గడం లేదు.. జగన్మోహన్ రెడ్డి సర్కార్. విప్‌లకు ఇంటి అద్దె అలవెన్స్.. ఏకంగా.. నెలకు రూ. లక్ష చొప్పున ఇచ్చారు. అంతే కాదు.. మెయిన్టనెన్స్ కింద.. మరో రూ. ఐదు వేలు అదనం. ఇలా.. ఎంత మందికి ఇచ్చారో లెక్క లేదు. ఏదైనా.. ప్రభుత్వ నియామకం అంటే… రూ. లక్షల్లోనే జీతభత్యాలు అందుతున్నాయి. వారి వల్ల ప్రజలకు .. ప్రభుత్వానికి ఎంత మేర సేవలు అందుతున్నాయో తెలియదు కానీ.. సివిల్ సర్వీస్ అధికారులను మించి.. జీతభత్యాలు పొందుతూ.. అధికారాన్ని అనుభవించేసేవాళ్లు ఇప్పుడు సెక్రటేరియట్లో ఎక్కువైపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కొసమెరుపేమిటంటే.. జగన్మోహన్ రెడ్డి తీసుకునే జీతం రూపాయేనట..!