దొంగ లెక్కలు రాయడం.. తప్పుడు కథలు చెప్పడం ఇప్పుడు ఏపీ అధికారులకు ఓ కామన్ ప్రాక్టిస్ అయిపోయింది. పోలీసులు వివిధ కేసుల్లో చెప్పిన కథలు వారిని నవ్వుల పాలు చేశాయి. సోషల్ మీడియా అంతా పుసుక్కున నవ్వింది. అయితే అలాంటి వాటిని తుడి చేసుకుని వారు చేయాల్సిన పనిని చేస్తున్నారు. ఇప్పుడు కథలు చెప్పే వంతు ఆర్థిక శాఖ అధికారులకు వచ్చింది. తమ జీపీఎఫ్ అకౌంట్లో రూ. ఎనిమిది వందల కోట్లు తగ్గిపోయాయని ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూంటే.. ప్రభుత్వ ఉన్నతాధికారులు మాత్రం తీరిగ్గా కథలు చెబుతున్నారు.
అసలేం జరిగిందో తమకు తెలియదంటూనే .. ఆర్థిక శాఖ ఉన్నతాధికారి రావత్ సాఫ్ట్ వేర్ కథ మీడియాకు వినిపించారు. అసలు ఉద్యోగులకు జీపీఎఫ్ చెల్లించలేదని.. చెల్లించాలని సీఎఫ్ఎంఎస్కు పంపిస్తే.. ఆటోమేటిక్గా క్లియర్ అయిపోయిందంని.. తర్వాత తప్పు తెలుసుకుని సాఫ్ట్ వేర్ ఆ నిధుల్ని వెనక్కి తీసుకుందని ఆయన చెబుతున్నారు. ఆయన చెప్పిన ప్రకారం చూస్తే సాఫ్ట్ వేర్ స్వతంత్రంగా పని చేస్తోందని అనుకోవాలి. ఆపరేట్ చేసేవాళ్లు కమాండ్ ఇస్తేనే కానీ కదలని సాఫ్ట్ వేర్ దే తప్పని …మాకేం సంబంధం లేదని రావత్ చెప్పేందుకు ప్రయత్నించారు.
అయితే ఇక్కడ రావత్ చెప్పిన కథ ఎంత నమ్మశక్యంగా లేదో.. ఉద్యోగులకు మరో ఆందోళనకరమైన విషయం ఇందులో ఉంది. అసలు వెనక్కి తీసుకున్న జీపీఎఫ్ సొమ్మును ప్రభుత్వం ఇవ్వలేదంటున్నారు. పొరపాటున జమ అయిందంటున్నారు. త్వరలో ఇస్తామంటున్నారు. అంటే.. ఆ జీపీఎఫ్ సొమ్మును… పీఆర్సీలో భాగంగా వెనక్కి తీసుకున్నారన్న అనుమానమూ వ్యక్తం చేస్తున్నారు. అంటే… తిరిగివ్వరన్నమాట.
ప్రభుత్వం ఏ ఒక్క విషయంలోనూ పారదర్శకతతో లేదు. అంతా తప్పుడు లెక్కలు… డొంక తిరుగుడు సమాధానాలతో నడిచిపోతోంది. నిజంగా ఏం జరుగుతుందో మాత్రం చెప్పడం లేదు. ఈ పరిస్థితితో ఉద్యోగులు సైతం గందరగోళం చెందుతున్నారు.