ఉద్యోగుల సమ్మె ఎలా చూసినా ఉద్యోగులకే కష్టనష్టాలు తెచ్చేలా కనిపిస్తోంది. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున జీత భత్యాల చెల్లింపులు నిలిపివేసే అవకాశం కనిపిస్తోంది. పని చేసిన ఈ నెలకూ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. పాత జీతాలు కావాలని ఉద్యోగులు అంటూంటే తక్షణం కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇస్తామని బిల్లులు ప్రాసెస్ చేయాలని ఉద్యోగులపై ఒత్తిడితెస్తున్నారు. ఉద్యోగులు మాత్రం తాము చేయలేమని మొండికేస్తున్నారు. ఇక నాలుగు రోజుల్లో జీతాలు అకౌంట్లలో పడాల్సిన పరిస్థితుల్లో ఇంత వరకూ జీతాలు చెల్లించే విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
ప్రభుత్వం జీతాలివ్వాలనుకుంటే సీఎంఎఫ్ఎస్ వ్యవస్థ మొత్తాన్ని కంట్రోల్లోకి తీసుకుని జీతాలిచ్చేయగలదు.కానీ అలా ఇవ్వాలంటే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉండాలి. ప్రభుత్వ ఖాతాలో కాసులు ఉండాలి. గత నెలకు సంబంధించే కొంత మందికి జీతాలు పెండింగ్ ఉన్నాయని ఉద్యోగ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు కొత్త జీతాలకు డబ్బులు అంత తేలికగా రావు. ప్రభుత్వం అదనపు రుణానికి ఇంకా ఆమోదం తెలుపలేదు. ఆర్థిక శాఖతో ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సమావేశం అయినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఈ నెల గండాన్ని తప్పించుకోవడానికి ఉద్యోగుల సమ్మె ప్రభుత్వానికి బాగా కలసి వస్తోంది.
మరి ఉద్యోగుల సంగతేంటి? వారు తీవ్రంగా నష్టపోనున్నారు. ఈ నెల జీతం పెండింగ్ పెడితే.. ఇక ఇస్తారో లేదో చెప్పడం కష్టం. అలాగే సమ్మె చేసిన కాలానికి జీతం రావడం కూడా కష్టమే. గతంలో కరోనా పేరుతో ఆపేసిన జీతమే ఇంత వరకూ ఇవ్వలేదు. ఇప్పుడు అసలు ఇచ్చే చాన్స్ లేదు. ఎలా చూసినా సమ్మెకు వెళ్లి ఉద్యోగులు తీవ్రంగా నష్టపోనున్నారు. ప్రభుత్వానకి భారీ వెసులుబాటు లభించడం ఖాయంగా కనిపిస్తోంది.