జీతాలివ్వలేదని టీచర్లు రోడ్డెక్కిన చరిత్ర ఉందా అని హైకోర్టు న్యాయమూర్తి సీఎస్ జవహర్ రెడ్డిని నిలదీస్తే.. “మా నాయన కూడా టీచరే సార్.. నా చిన్నప్పుడు మూడు నెలల జీతాల కోసం రోడ్డెక్కిండు” అని జవహర్ రెడ్డి చెప్పిన సమాధానం అమాయకమో.. లేకపోతే ప్రభుత్వాన్ని సమర్థించాలనుకుంటున్నారో కానీ.. పరువు మాత్రం అడ్డంగా తీసేసింది. రాష్ట్రాన్ని నలభై,యాభై ఏళ్ల వెనక్కు తీసుకెళ్లిపోయారని.. దీని ద్వారా సీఎస్ అంగీకరించినట్లయింది. ఇప్పుడు రాష్ట్రంలో జీతాల కోసం ఎదురు చూసేది.. ఉద్యోగులు మాత్రమే కాదు.. చివరికి పారిశుద్ధ్య కార్మికులు కూడా. నిన్నటికి నిన్న సీఆర్డీఏ కార్యాలలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేశారు. జీతాలివ్వరేమిటని నిలదీశారు. కానీ అధికారుల వద్ద సమాధానం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఠంచన్‌గా ఎవరికైనా జీతాలు అందుతాయంటే అది సలహాదారులకు మాత్రమే. ఒక్క సలహాదారుడికి పని ఉండదు.కేవలం ప్రజాధనాన్ని అప్పనంగా దోచి పెట్టడానికే సలహాదారుల్ని నియమించారు. వారికి మాత్రం తేడా లేకుండా జీతం ఖాతాల్లో పడిపోతుంది. కానీ ఉద్యోగులు.. పారిశుద్ధ్యం కార్మికులు..ఇతరచిన్నా చితకా ఉద్యోగులు మాత్రం జీతాల కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ధర్నాలు కూడా చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో ప్రభుత్వాన్ని నమ్మి పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం కిందా మీదా పడుతున్నారు. ప్రయత్నించి.. విఫలమై.. చివరికి హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. రూ. ఐదు లక్షల బిల్లు చెల్లించలేనంత దుస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందా.. అని తమ వద్దకు వస్తున్న పిటిషన్లను చూసి ఆశ్చర్యపోయి హైకోర్టు వ్యాఖ్యానించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని అందుకే..ఇవ్వలేకపోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. కానీ.. ఎక్కడైనా దుబారా ఖర్చు ఆగిందా అంటే.. అలాంటి చాన్సే లేదు. బైజూస్ కు రూ. వెయ్యి కోట్ల వరకూ కట్టబెట్టారు. ఆన్ లైన్ లో నే పన్నెండు వేలకు దొరికే ట్యాబ్.. పదమూడున్నర వేలకు కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచుతున్నారు. ఆ పేరుతో కోట్లు పెట్టి పత్రికలకు ప్రకటనలు ఇస్తున్నారు. సీఎం జగన్ జన్మదిన వేడుకలకు రూ. రెండున్నరకోట్లు ఖర్చు చేశారు. ఇలా చెప్పుకూంటూ పోతే.. సీఎం వ్యక్తిగత అవసరాలు.. ఆయన వ్యాపార సంస్థలకు లబ్ది చేకూర్చే పనులు మాత్రం ఆగడం లేదు.
ఇలా ప్రభుత్వం నుంచి జీతాలు , బిల్లులు రావాల్సిన వారు..ఏపీ ప్రజలు కాదని అనుకుంటారో ఏమో కానీ.. వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటం.. సమాజంలో చీలిక తెచ్చే అవకాశం ఉంది. ఏపీకి ఇంత ఖర్మ పట్టిందేమిటని అనుకోవాల్సిన దుస్థితి తెచ్చి పెట్టింది.