ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మరణమృదంగం మోగుతోంది. మూడు రోజుల వ్యవధిలో నలుగురు కరోనా కారణంగా చనిపోయారు. దీంతో ఉద్యోగులంతా వణికిపోతున్నారు. వర్క్ ఫ్రం హోంకు అవకాశం ఇవ్వాలని.. లేకపోతే కనీసం యాభై శాతం మందితో మాత్రమే పని చేసేలా అయినా ఉత్తర్వులు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలనేతలు ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. కానీ నేరుగా కలిసే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. అమరావతిలో కరోనా పరిస్థితి తీవ్రంగా ఉంది. ఉద్యోగులు.. కరోనా బారిన పడటం ఎక్కువయింది. మామూలుగా అయితే.. వర్క్ ఫ్రం హోంకు అవకాశం ఇస్తారని ఉద్యోగులు ఎదురు చూశారు. కనీసం యాభై శాతం మందితో అయినా కార్యాలయాలు నడిపిస్తే.. కొంత మేర కరోనా నుంచి రక్షణ పొంద వచ్చని అనుకున్నారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. నలుగురు ఉద్యోగులు చనిపోయినా… లైట్ తీసుకుంది.
తమ శాఖ ఉద్యోగి చనిపోవడంతో మంత్రి పెద్దిరెడ్డి… తన చాంబర్లో రెండు నిమిషాలు మౌనం పాటించారు కానీ.. ఉద్యోగుల రక్షణ కోసం.. ఏం చేస్తామో చెప్పలేదు. మాట కంటే ముందు ప్రభుత్వాన్ని సమర్థిస్తూ మాట్లాడి.. వారికి అవసరం అయినప్పుడల్లా సమావేశాలు పెట్టిన .. ఉద్యోగ సంఘాల నేతలకు ఇప్పుడు ప్రభుత్వ పెద్దల అపాయింట్మెంట్ దొరకడం లేదు. అందుకే లేఖల బాట ఎంచుకున్నారు. కరోనా భయంతో పని చేయలేకపోతున్నామని.. ఉద్యోగులు.. ఉద్యోగ సంఘ నేతల దృష్టికి తీసుకెళ్తున్నారు. కానీ వారేమీ చేయలేకపోతున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేసే పరిస్థితి లేదు. ఉద్యోగుల్ని అలా వదిలేయడం తప్ప.. ఉద్యోగ సంఘం నేతలు కూడా ఏమీ చేయలేని పరిస్థితికి వస్తున్నారు.
దీంతో ఉద్యోగులు తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ఉద్యోగుల విషయంలో సీఎం జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. వారి రక్షణకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కూడా సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ సంఘం నేత అశోక్ బాబు కూడా.. ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. నలుగురు చనిపోయినా ప్రభుత్వం పట్టనట్లుగా ఉంటోందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.