టీడీపీ డేటా చోరీ అంశంలో అడ్డంగా దొరికిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఫామ్-7ల విషయంలోనూ.. అదే పరిస్థితిలో పడిపోయింది. వైసీపీకి ప్రస్తుతం కర్త, కర్మ, క్రియగా వ్యవహరిస్తున్న “ఐ ప్యాక్” ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో ఓట్ల తొలగింపు కోసం పెద్ద కుట్ర జరిగినట్లుగా… స్పష్టమైన ఆధారాలు.. ఏపీ పోలీసులకు లభించాయి. బీహార్, యూపీ నుంచి.. ఈ ఫామ్-7ల వెల్లు వచ్చినట్లు ఐపీ అడ్రస్లు.. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది. ఎపీలో తీగ లాగితే బీహార్ లో డొంక కదులుతుంది. ఆన్ లైన్ లో దరఖాస్తుల ఐడీల వెనుక అసలు గుట్టు బయటకు లాగుతున్నారు
సజీవంగా ఉన్నవారిని చనిపోయినట్లు, ఊళ్లో ఉన్న వారిని లేనట్టుగా చూపించి వారి ఓట్లను తొలగించాలని దరఖాస్తు చేసిన ఫాం 7 అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో ఫాం 7 దరఖాస్తులలో 95శాతం వరకు నకిలీవని తేలాయి. ఆన్ లైన్ లో అందిన దరఖాస్తుల గుట్టు అధికారికంగా రట్టు అవ్వాలంటే ఎన్నికల కమిషన్ సర్వర్ లోని బ్యాకప్ డేటాను సేకరించాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ సర్వర్లు కోయంబత్తూరులోని సిడాక్ లో ఉంటాయి. ఇప్పటికే ఆ వివరాల సేకరణ దాదాపుగా పూర్తయింది. ఫాం 7 దరఖాస్తులను ఆన్ లైన్ లో బీహార్, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్ నుంచి అప్ లోడ్ చేసినట్లు తేలింది. కొన్ని గ్రామాలలో దాదాపుగా ఐదు వందల నుంచి తొమ్మిది వందల వరకు ఓటర్లను తొలగించాలని బీహార్ నుంచి దరఖాస్తులు అప్ లోడ్ కావడం తెలుసుకున్న అధికారులు కుట్ర కోణాన్ని బయటకు తెస్తున్నారు.
గుంటూరుజిల్లాలో ముఖ్యంగా చిలకలూరిపేట, అనంతపురం జిల్లాల్లోని రాప్తాడు, ధర్మవరం, మరికొన్ని నియోజకవర్గాలలో ఓట్ల తొలగింపుకు ఫాం 7 దరఖాస్తులు, బెంగుళూరు, బీహార్ లోని రాంచీ నుంచి అప్ లోడ్ కావడంతో అధికారులకు మైండ్ బ్లాంక్ అయ్యింది. అదే సమయంలో.. ఎవరి పేరుపై అయితే దరఖాస్తు చేశారో.. వారికి ఫామ్ -7 అంటే ఏమిటో తెలియదు. వారిలో చాలా మంది నిరక్ష్యరాస్యులు. ఇంకా చెప్పాలంటే.. కొంత మంది మంచానికే పరిమితమయ్యారు. మరికొంత మంది చనిపోయారు కూడా. 11వ తేదీ నుంచి దర్యాప్తును వేగవంతం చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. జిల్లా స్థాయిలో జరుగుతున్న దర్యాప్తు, ప్రాధమిక సాక్ష్యాధారాలను రికార్డు చేసి, ఆ తర్వాత సాంకేతిక సాక్ష్యాలను కూడా సేకరించి కోర్టులో ఛార్జిషీట్లు ఫైల్ చేయాలని నిర్ణయించారు. బీహార్, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్ లలో ఐపీ అడ్రస్ లు తగులుతుండటంతో వారిని కూడా అదుపులోకి తీసుకోవాలని కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ణయించింది. బీహార్ అంటే… ఐ ప్యాక్ ప్రశాంత్ కిషోర్ స్వస్థలం. కేసు ఆయన దగ్గరకే పోయే అవకాశం కనిపిస్తోంది.