వ్యాక్సినేషన్ విషయంలో తాము తోపులం అని చెప్పుకోవాలని ఏపీ సర్కార్ తెగ ఆరాట పడుతోందో.. లేకపోతే.. ఆరోగ్య శాఖ ముఖ్యమంత్రి వద్ద అలా ఫోకస్ అయి మార్కులు కొట్టేయాలని తాపత్రయ పడుతుందో కానీ.. సోషల్ మీడియాలో తరచూ అభాసు పాలవుతోంది. మొన్నటి మాస్ వ్యాక్సినేషన్ విషయంలో వచ్చిన ఫీడ్ బ్యాక్‌ను పట్టించుకోని ఆరోగ్యశాఖ.. ఈ రోజు.. వ్యాక్సినేషన్ మొత్తం లెక్కలపై కిందా మీదా పడింది. లెక్కల్లో తప్పులను సోషల్ మీడియా ఇట్టే పట్టేసుకోవడంతో మూడు సార్లు డిలీడ్ చేసుకోవాల్సి వచ్చింది. దీంతో అసలు చెబుతున్న లెక్కలు నిజమేనా అన్న అనుమానాలు వినిపించడం ప్రారంభించాయి.
ఈ రోజు ఉదయం పది గంటల సమయంలో.. కేంద్రం 46.46 మిలియన్ డోసులు ఏపీకి ఇస్తే.. ఏపీ ప్రభుత్వం 58.74 మిలియన్ డోసులు ప్రజలకు ఇచ్చిందని ఆరోగ్య ఆంధ్ర ట్విట్టర్ అధికారిక హ్యాండిల్లో పబ్లిష్ చేశారు. నిజంగా 46 మిలియన్ల డోసులు అంటే.. ఏపీ ప్రజలు మొత్తానికి వ్యాక్సిన్ సరిపోతుంది. ఇదే ట్విస్ట్ అనుకుంటే.. అసలు ఇచ్చింది 46 మిలియన్లు అయితే.. వేసింది 58 మిలియన్లు అని చెప్పుకొచ్చింది. మిగతా 12 మిలియన్లు అంటే కోటి ఇరవై లక్షల డోసులు ఏపీ సర్కార్ ఎక్కడి నుంచి తెచ్చిందన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో వచ్చి పడ్డాయి. రియాక్షన్ వెంటనే తెలుసుకున్న ఆరోగ్యాంధ్ర నిర్వాహకులు.. ట్వీట్ డిలీట్ చేశారు. పది నిమిషాల వ్యవధిలో మళ్లీ పోస్టు పెట్టారు. అందులో కాస్త తప్పు దిద్దుకున్నారు. 46 మిలియన్లు కాదు.. 4.6 మిలియన్లే అని చెప్పుకున్నారు. అది కొంత వరకు బాగానే ఉంది.. కానీ 4.6 మిలియన్లు ఇస్తే 5.8 మిలియన్ల టీకాలు ఎలా వేశారన్న ప్రశ్నలు వెల్లువెత్తాయి. దాంతో ఆరోగ్యాంధ్ర నిర్వాహకులు మళ్లీ నాలిక్కరుచుకున్నారు. ఆ ట్వీట్‌ను డిలీట్ చేసి..మళ్లీ కొత్తగా ట్వీట్ చేశారు.
దాని ప్రకారం కేంద్రం నుంచి 4.11 మిలియన్ల డోసులు ఏపీకి వచ్చాయని.. తాము 3.98 మిలియన్ల డోసులు ప్రజలకు పంపిణీ చేశామని చెప్పుకున్నారు. మొదట చెప్పిందానికి మూడో ట్వీట్‌కు హస్తిమ శకాంతరం ఉంది. ఈ తప్పుడు లెక్కల తిప్పలేమిటో.. కానీ.. నెటిజన్లు మాత్రం.. ఏపీ ఆరోగ్యశాఖను.. ఓ ఆట ఆడుకున్నారు. ఫేక్ లెక్కలతో ఎంత కాలం టైం పాస్ చేస్తారని ప్రశ్నలు గుప్పించారు. ఇలాంటి అవకాశం దొరికితే టీడీపీ ఊరుకుంటుందా..?. నోటికి ఏది వస్తే అది గాలి లెక్కలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారని విరుచుకుపడింది. మొత్తం మీద.. వ్యాక్సిన్ విషయంలో సర్కార్ పరువును ఆరోగ్య ఆంధ్ర రోడ్డున పడేసినట్లయింది.