ఆంధ్రప్రదే్శ్ సర్కార్ పరిమితికి మించి అప్పులు చేస్తోంది. ఈ విషయాన్ని కాగ్ స్పష్టంగా చెప్పింది. అప్పులు చేయడం తప్పు కాదు. కానీ ఆ అప్పులకు తగ్గట్లుగా ఆస్తులను క్రియేట్ చేసినప్పుడు మాత్రమే… తిరిగి చెల్లించే సామర్థ్యం పెరుగుతుంది. అంటే రూ. పాతిక లక్షలు లోన్ తీసుకుని ఇల్లుకొనుక్కుంటే… ఆ ఇంటి వాల్యూ అంతకంతకూ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి తీర్చే సామర్థ్యం కూడా పెరుగుతుంది. కానీ ఆ రూ. పాతిక లక్షల లోన్ తీసుకుని లావిష్లో ఇంట్లో శుభకార్యం చేసేసి ఖర్చు పెడితే… వాటిని తీర్చడానికి ఆస్తులు అమ్మాల్సి వస్తుంది. ఆ ఆస్తులు కూడా లేకపోతే ఐపీ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏపీకి అలాంటి పరిస్థితే వస్తుందని… ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఏపీ సర్కార్ చేస్తున్న అప్పులు అన్నీ అనుత్పాదక వ్యయానికే ఖర్చు పెడుతూండటమే దీనికి కారణం.
ఈ ఆర్థిక సంవత్సరంలో 10 నెలలకు తీసుకున్న అప్పు రూ. 73, 913 కోట్లు. బడ్జెట్లో ఏడాది మొత్తం చేస్తామని చెప్పిన అప్పు రూ. 48, 295 కోట్లు మాత్రమే. రెవెన్యూ లోటు రూ. 54,046 కోట్లుకు చేరింది. అంటే ఆదాయానికి .. ఖర్చులకు మధ్య అంతరం అన్నమాట. ఇంత మొత్తం పూడ్చుకోవడం అసాధ్యం. అందుకే అధిక వడ్డీలకు ఆర్బీఐ దగ్గర వేస్ అడ్ మీన్స్ తో పాటు ఓవర్ డ్రాఫ్ట్‌ను కూడా ఉపయోగించుకుంటోంది. ఆదాయ వనరులను పెంచుకునేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దశ..దిశా లేని ఆర్థిక వ్యవహారం వల్ల.. మొత్తానికే పరిస్థితి దిగజారిపోతోందని.. నిపుణులు అంటున్నారు.
రెండు నెలల్లో మరో పది వేలో.. పదిహేనువేల కోట్లో అప్పులు చేస్తారు. అలా చేస్తేనే.. జీతాలతోపాటు.. ఏడాది చివరిలో చెల్లింపులు చేయాల్సినవి చేయగలుగుతారు. లేకపోతే ఇబ్బంది పడతారు. వచ్చే ఏడాది మార్చి నుంచి మళ్లీ కొత్త అప్పులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ.. చేసిన అప్పులకు చెల్లించాల్సిన కిస్తీలు కూడా పెరుగుతాయి. ఇప్పుడు ఏపీ సర్కార్ ను ఇదే ఆందోళనకు గురి చేస్తోంది. అప్పుల వాయిదాలు చెల్లింపులు చేయకపోతే… దివాలా కింద పరిగణిస్తారు. అలాంటి పరిస్థితి రానీయకుండా ఇప్పుడు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఈ ఒత్తిడి తట్టుకోలేకనేమో.. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సెలవు పెట్టి వెళ్లిపోయారు.