ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థఇతి అత్యంత దారుణంగా ఉందని తొలి ఆరు నెలల రిపోర్ట్‌తో కాగ్ బయట పెట్టింది. రెవిన్యూ లోటు తొలి ఆరు నెలల్లో ఏకంగా రూ.33,140.62 కోట్లుగా నమోదయింది. అంటే 662 శాతం అధికం. ఆదాయానికి, ఖర్చులకు మధ్య పొంతన లేకపోవడమే దీనికి కారణం. ఏపీ ఆర్థిక పరిస్థితి నిజానికి ఎంతో మెరుగ్గా ఉండాలి. ఎందుకంటే ఆదాయం భారీగాపెరిగింది.
తొలి ఆరు నెలల్లోకి ఏపీకి భారీగా పెరిగిన ఆదాయం, గ్రాంట్లు !
ఆరు నెలల్లో పన్నులు, కేంద్ర గ్రాంట్లు, అప్పుల ద్వారా ఏపీ ప్రభుత్వ ఖాతాకు వచ్చిన ఆదాయం రూ. లక్షా నాలుగు వేల కోట్లపైనే. ఇందులో అప్పులు రూ. 40వేల కోట్లు. మిగతా రూ. 65వేల కోట్లు పన్నులు, గ్రాంట్లు. గత ఏడాది కన్నా రూ. 20వేల కోట్లు ఎక్కువ. ఇంత భారీగా పన్నుల ఆదాయం పెరగడం అసాధారణం. ప్రభుత్వం మద్యం రేట్లు భారీగా పెంచడం సహా అనేక రకమైన పన్నులను విధించడంతో ఈ ఆదాయం కళ్ల జూస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు కూడా అనూహ్యంగా పెరిగాయి. గతంలో రూ. నాలుగు వేల కోట్లకు అటూ ఇటుగా వచ్చి న గ్రాంట్లు ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో రూ. 18,117.56 కోట్లు ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యాయి. ఇంత ఆదాయం వచ్చినా ప్రభుత్వం లెక్కలేనన్ని అప్పులు చేస్తోంది. తొలి ఆరు నెలల్లో కొద్దిగా తక్కువగా రూ.40వే కోట్ల అప్పు చేసింది. అయినా లోటు మాత్రం అలాగే ఉండిపోయింది.
అభివృద్ది పనుల్లేవ్.. బిల్లులు చెప్పింపుల్లేవ్ ! మరి డబ్బులన్నీ ఎటు పోతున్నాయి ?
ప్రభుత్వం ఎవరికీ బిల్లులు చెల్లించడం లేదు. ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించడం లేదు. అభివృద్ధి పనులకు ఖర్చులు చేయడం లేదు. కనీస అవసరాలకు సరఫరా చేస్తున్న వాటికీ బిల్లులు చెల్లించడం లేదు. పిల్లలకు ఇచ్చే పాలు, గుడ్ల బిల్లులు కూడా చెల్లించడం లేదన్న ఆరోపణలు వసతున్నాయి. నిన్నటికి నిన్న మెడికల్ ఉపకరణాలను ఏపీకి సరఫరా చేయవద్దని ఐఎండీ ఇండస్ట్రీ ఆదేశాలు జారీ చేసింది. సివిల్ కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించడం మానేసి చాలా కాలం అయింది. వారు టెండర్లు కూడా వేయడం లేదు. ప్రభుత్వం టెండర్లు పిలిస్తే ఎవరూ పనులు చేయడానికి ముందుకు రావడం లేదు. చివరికి ప్రభుత్వ శాఖలు కరెంట్ బిల్లులు చెల్లించడం లేదు. డిస్కంలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ నిధులు కూడా ఇవ్వడంలేదు. డిస్కంలకు రెండున్నరేళ్లలో రూ. పాతిక వేల కోట్ల బకాయి పడ్డారని తక్షణం చెల్లించాలని ఏపీఈఆర్సీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇలాంటి ఆర్థిక సమస్యలు ప్రభుత్వానికి కోకొల్లలుగా ఉన్నాయి.
రూపాయి రాకపోకల గురించి ఎవరు జవాబు దారీ ?
జీతాలు, పెన్షన్లు ఏ ప్రభుత్వం అయినా ఇవ్వాలి. ఇస్తాయి. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇస్తుంది.ఇక ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో నేరుగా ప్రజలు భారీగా రూ. పదివేలకుపైగా డబ్బు అందుతున్నది ఒక్క అమ్మఒడి మాత్రమే. యాభై లక్షల మంది వరకూ ఇస్తున్నారు. మిగతావన్నీ చాలా పరిమితమైన లబ్దిదారులు. ఓ పథకం అందితే మరో పథకం అందనివ్వరు. గత ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నింటినీ ఆపేశారు. మరి ఆ డబ్బులన్నింటినీ ఏం చేస్తున్నారు..? తెస్తున్న అప్పులు ఏమవుతున్నాయి ? మందు బాబుల్ని నిలువు దోపిడి చేసి పోగేస్తున్నదంతా ఎటు పోతున్నాయి.? ఇవన్నీ లెక్కలు బయటపెడితే కానీ మిస్టరీ వీడదు.