ఆర్థిక సంవత్సరం ముగింపు. అన్ని సంస్థలు తమకు రావాల్సిన బాకీలను వీలైనంత ఎక్కువగా వసూలు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇందు కోసం ఇంటికొచ్చి కూర్చునే వాళ్లు కూడా ఉంటారు. అప్పుల్లో ఉన్న ఏపీ ప్రభుత్వానికి కూడా ఇలాంటివి అలవాటే. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి ఇప్పుడు మరింత ఎక్కువగా ఒత్తిడి ఉంది. రుణాలు తీసుకుని ఈఎంఐలు కట్టడం మానేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు.. చెల్లించడం లేదని.. ఏపీ సచివాలయానికి వచ్చి కూర్చునే ఆలోచనలో ఉన్నారు.
లేఖలు రాసినా స్పందన కనిపించడం లేకపోవడంతో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, హడ్కో వంటి సంస్థల ఉన్నతాధికారులు సోమవారం విజయవాడ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హడ్కో నుంచి పలు ఏపీ కార్పొరేషన్లు రుణాలు తీసుకున్నాయి. వాయిదాలు చెల్లించడం లేదు. ఓవర్డ్యూస్గా, నిరర్ధక ఆస్తుల జాబితాలోకి కూడా చేరిపోయాయి. ఇక రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ కు రూ. వెయ్యి కోట్ల బకాయి ఉంది. వీటికోసం వస్తున్నామని సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
గతంలో ఓ సారి ఇలాగే వచ్చారు. అప్పటికప్పుడు సలహాదారుగా నియమించుకున్న మాజీ ఎస్బీఐ చైర్మన్ ద్వారా ఎస్బీఐ నుంచి నుంచి లోన్ ఆమోదం పొందగలిగారు. ఆ రోజుకు గండం గట్టెక్కారు. తర్వాత కిస్తీలు కూడా కట్టాల్సి ఉంది. వాటిని కట్టడం లేదు. ప్రభుత్వం ఇవ్వకపోతే .. తమ సంస్థల లెకల్లో ఈ ఆర్థిక సంవత్సరం విషయంలో తేడాలు వస్తాయని.. వారు కంగారు పడుతున్నారు. సచివాలయంలో కూర్చుని వసూలు చేసుకోవాలనకుంటున్నట్లుగా తెలుస్తోంది.