ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత… ఏపీ… ఓ వ్యవసాయ ప్రధాన రాష్ట్రంగా మిగిలిపోయింది. పారిశ్రామికీకరణ లేదు. ఓ భారీ పరిశ్రమ అంటూ లేదు. 2014లో ఏదైనా ఉద్యోగం అంటే.. ఏపీ చుట్టుపక్కల ఉండే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లకు పోవాల్సిన పరిస్థితి. కానీ ఐదేళ్లలోనే ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తిదాయకమైన పరుగు అందుకుంది. ఐటీ నుంచి ఆటోమోబైల్ వరకూ.. అనేక రంగాల్లో దిగ్గజాలనదగ్గ పరిశ్రమలు వచ్చాయి. ఇంకా పెద్ద పెద్ద పరిశ్రమలు ప్లానింగ్‌లో ఉన్నాయి.
పేపర్ల మీద కాదు ఉత్పత్తి దశలో పరిశ్రమలు..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద పరిశ్రమ వచ్చినా హైదరాబాద్ పరిసర ప్రాంతాలే అనువైనవిగా చూపేవారు. వెనుకబడిన జిల్లాలను, ఇతర ప్రాంతాలను పట్టించుకునేవారే కాదు. కానీ ఇప్పుడు పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూస్తున్నారు. చంద్రబాబు 2014లో పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే గతంలో హైదరాబాద్ నగర అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలను తీసుకువచ్చేందుకు కృషి చేసిన తరహాలోనే, నవాంధ్రప్రదేశ్ కోసం ప్రపంచమంతా చుట్టి పెట్టుబడుల వేట సాగించారు. అమెరికా, జపాన్, చైనా, సింగపూర్ , దక్షిణ కొరియా దేశాల్లో పర్యటించారు. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికను రాష్ట్ర పారిశ్రామిక ఆకర్షక కేంద్రంగా మార్చేశారు. ఐదేళ్ల పాటు చంద్రబాబు అవిశ్రాంతంగా.. పని చేసిన ఫలాలు ఇప్పుడు మన కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని అగ్రశ్రేణి కార్ల కంపెనీల్లో ఒకటయిన కియా… నాలుగేళ్ల వ్యవధిలోనే… అన్నీ పూర్తయిపోయి… ఉత్పత్తి ప్రారంభించడం… ఓ గొప్ప.. విజయం. వెనుకబడ్డ రాయలసీమ వాహన తయారీరంగానికి హబ్‌గా మారుతోంది. కరువు తాండవించే అనంతపురం జిల్లాలో దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ దిగ్గజ సంస్థ కియ తన ప్లాంటును ఏర్పాటు చేసింది. ట్రయల్ ప్రొడక్షన్ ప్రారంభమైంది. “కియ” సంస్థకు అనుబంధంగా మరిన్ని సంస్థలూ పెట్టుబడులు పెట్టాయి. ఓర్వకల్లు సమీపంలో రూ.ఆరు వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేశారు. అపోలో టైర్స్, హీరో లాంటి అగ్ర స్థాయి కంపెనీలు కూడా.. ఉత్పత్తిని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాయి.
ఐటీ రంగంలో అసాధారణ పనితనం..!
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగం జీరో. కానీ ఇప్పుడు… చెప్పుకోవడానికి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, హెచ్‌సీఎల్ లాంటి కంపెనీలు ఉన్నాయి. ఐటీ అభివృద్ధికి పాలసీలను రూపొందించడమే కాదు.. వాటి అమలులోనూ ప్రణాళికాబద్ధంగా వ్యవహించింది ఏపీ. ఫార్చ్యూన్-500 కంపెనీలను ఆకర్షించే లక్ష్యంతో కొత్త పాలసీ తీసుకొచ్చారు. విశాఖను బ్లాక్ చెయిన్ టెక్నాలజీకి సెంటర్ గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. విశాఖపట్నంలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, కాన్‌డ్యుయెంట్, ఏఎన్ఎస్ఆర్, గూగుల్ ఎక్స్ లాంటి భారీ కంపెనీలు వచ్చాయి. విశాఖలో ఒకప్పుడు ఖాళీగాఉన్న హిల్-1, హిల్-2 ఇప్పుడు ఐటీ కంపెనీలతో నిండిపోయాయి. మిలీనియం టవర్స్ అందుబాటులోకి వచ్చింది. కాపులుప్పాడలో ఐటీపార్కు ఏర్పాటుకు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. డేటా సెంటర్ ఏర్పాటైంది. ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న గన్నవరం మేథా టవర్స్ ఐటీ కంపెనీలతో పూర్తిగా నిండిపోయింది. మంగళగిరి ప్రాంతం మినీ ఐటీ హబ్‌గా రూపొందుతోంది. ఏపీఎన్ఆర్టీతో కలిసి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలలోని ఇండ్‌వెల్ టవర్స్, మేథా టవర్స్, కే విజినెస్ స్పేస్, పై కేర్, ఎన్నార్టీ టెక్ పార్కుల్లోకి పదులకొద్దీ కంపెనీలు వచ్చాయి. బెంగళూరులోని కంపెనీలను ఆకర్షించేందుకు అనంతపురంలో బెంగళూరు ప్లస్ ప్లస్ పేరుతో ఐటీ పార్కు ఏర్పాటైంది. బిగ్ డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఫిన్‌టెక్, బ్లాక్ చైన్ టెక్నాలజీల్లో ముందుకెళ్ళేందుకు విశాఖలో ఫిన్‌టెక్ వ్యాలీని ఏర్పాటుచేశారు. ఏపీ ఫైనాన్షియల్ కేపిటల్ అయిన విశాఖను బ్లాక్‌చెయిన్ టెక్నాలజీకి సెంటర్‌గా మార్చడంలో విజయం సాధించారు లోకేష్. ఫార్చూన్ 500 కంపెనీలలో ఒకటయిన హెచ్‌సీఎల్‌ని విజయవాడకి రప్పించారు. హెచ్‌సీఎల్ రాక అమరావతిలో ఐటీ ముఖ చిత్రాన్ని మార్చేసింది. హెచ్‌సీఎల్‌కి ఏపీ 18 ఎకరాలు కేటాయించింది. ఎకరం స్థలంలో ఏర్పాటయ్యే కంపెనీల్లో కనీసం వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. . ఏపీలో ఇప్పటివరకు ఐటీ కంపెనీల ద్వారా 50వేలకుపైగా ఉద్యోగాలువచ్చాయి. పనులు ప్రారంభమైన కంపెనీల ద్వారా 27,500 ఉద్యోగాలు రాబోతున్నాయి. మరో 40వేల ఉద్యోగాల కల్పనకు వివిధ కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి.
ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ఏపీ హాట్ ఫేవరేట్..!
రాష్ట్ర విభజన సమయానికి ఏపీలో ఎలక్ట్రానిక్స్ రంగం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఎలక్ట్రానిక్స్ తయారీ లేనే లేదు. ఇప్పుడు తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ హబ్ రూపొందింది. ప్రతి పది సెల్ ఫోన్లలో మూడు ఏపీలోనే తయారవుతున్నాయి. విశాఖపట్నంలో మెడికల్ ఎలక్ట్రానిక్స్, అనంతపురం జిల్లా గుడిపల్లివద్ద డిఫెన్స్, ఏరోస్పేస్, పిసిబి తయారీ క్లస్టర్ల ఏర్పాటు చర్యలు చేపట్టారు. నెల్లూరు శ్రీసిటీ వద్ద, రేణిగుంటలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 1,2లను ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ల ఏర్పాటుద్వారా పెద్దఎత్తున కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయి. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఆటోఎలక్ట్రానిక్స్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ తయారీలు రాష్ట్రంలో జరిగేందుకు తీసుకున్న చర్యల ఫలితంగా ఫాక్స్‌కాన్, సెల్కాన్, డిక్సన్, కార్బన్ ఫోన్ల తయారీ సంస్థలు రాష్ట్రానికి వచ్చాయి. రిలయన్స్ గ్రూపు అధినేత ముఖేష్ అంబానీతో నారా లోకేష్ జరిపిన చర్చలు ఫలించాయి. రాష్ట్రానికి పెద్దఎత్తున రిలయన్స్ పెట్టుబడులు రానున్నాయి. రిలయన్స్ సంస్థ వివిధ దశల్లో రూ.15వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. తిరుపతి విమానాశ్రయం సమీపంలో 150 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ఏర్పాటు చేయనుంది. రోజుకి 10 లక్షల జియో ఫోన్లు, సెట్‌టాప్ బాక్సులు, ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులు రిలయన్స్ తయారుచెయ్యబోతుంది. దీనిద్వారా ఒకేచోట 25వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. కంపెనీల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, భూముల కేటాయింపులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. భూముల కేటాయింపు పూర్తిఅయిన తరువాత కావాల్సిన రోడ్లు, తాగునీటి సదుపాయం, 24 గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్నారు. ప్రాసెస్‌లో మరెన్నో ప్రాజెక్టులు ఉన్నాయి. కడపలో రూ. 20 వేల కోట్లు పెట్టుబడితో రాష్ట్ర ప్రభుత్వ ఉక్కు ఫ్యాక్టరీ, రామాయపట్నం ఓడరేవు, ఇండోనేషియా కంపెనీ ఈ పేపర్ మిల్స్, కాకినాడలో హల్దియా పెట్రో కెమికల్ రిఫైనరీ సహా అనేక ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి.
ఐదేళ్లలో అనితరసాధ్యంగా పారిశ్రామికీకరణ.. ఉద్యోగాల వృద్ధి..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉపాధి కల్పనలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని ఇండియా స్కిల్స్ రిపోర్టు 2019 వెల్లడించింది. భారతదేశంనుంచి నిపుణులను ఉద్యోగాల్లోకి తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత ప్రాధాన్యం లభిస్తోంది. దీనిలో స్త్రీ, పురుషులిద్దరికీ సమాన అవకాశాలు లభిస్తున్నాయి. ఐటిఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కళాశాలలనుంచి వివిధ అంశాల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. ముఖ్యంగా వారి నైపుణ్యం, పని పట్ల వారు పాటించే విలువలు, సంభాషణా చాతుర్యం, విశ్లేషణాత్మక ఆలోచనలు, సమస్యలను పరిష్కరించగలగడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఐదేళ్లలో ఏపీకి రూ. 15 లక్షల 61వేల కోట్ల పెట్టుబడులు రాగా.. 32 లక్షల 55వేల ఉద్యోగాలు లభించాయి. ఉద్యోగంపొందిన వారి వివరాలతో పాటు మొత్తం ప్రభుత్వం డాష్ బోర్డులో పెట్టింది. ఈ పారిశ్రామిక, ఉద్యోగ ప్రగతి.. అసాధారణం అని చెప్పుకోవాలి.
Investment tracker : https://www.apindustries.gov.in/Investment_AP/Index.aspx?LOS=All