ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సీనియర్ జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నా.. వారు జర్నలిస్టుల హక్కులు కాపాడటంలో విఫలమవుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా జర్నలిస్టులకు కనీస సంక్షేమం అందించడంలో ఫెయిలయ్యారు. చివరికి..ఎన్నో చిన్న పత్రికల జర్నలిస్టులకు ఆసరాగా ఉండే… అక్రిడేషన్ల విషయంలనూ అదే కాలయాపన జరుగుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే.. సమాచారశాఖ మంత్రి పేర్ని నాని .. జర్నలిస్టులు ఎంత చేయాలో.. అంత కంటే ఎక్కువే చేస్తామని పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు. రెండేళ్లు గడుస్తున్నా.. ఇంత వరకూ కనీసం అక్రిడేషన్లు కూడా ఇవ్వలేకపోయారు.
మొదట ఓ అక్రిడేషన్ల కమిటీ వేశారు. కానీ దానిపైనా… ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వెళ్లాయి. అందులో.. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులే ఎక్కువగా ఉన్నారని ఆ ఫిర్యాదుల సారాంశం. అంటే.. జర్నలిస్టులందర్నీ.. టీడీపీ సానుభూతిపరులుగా ముద్ర వేసేశారన్నమాట. అలాంటి ముద్ర వేసిన తర్వాత ప్రభుత్వం ఎందుకు ఊరుకుంటుంది.. మొత్తంగా అక్రిడేషన్ల కమిటీని రద్దు చేసింది. అసలు రద్దు చేయడానికే ఆ ముద్ర వేశారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత నాన్చి నాన్చి చివరికి కొత్తగా అక్రిడేషన్ కమిటీని వేశారు. ఈ సారి విచిత్రం..ఆ కమిటీలో అసలు జర్నలిస్టులే లేరు. అధికారులు మాత్రమే ఉన్నారు. అసలు జర్నలిస్టులు లేని కమిటీ జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఎలా ఇస్తుందన్న విమర్శలు ప్రారంభమయ్యాయి.
కొంత మంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగే పెద్దలు దీనిపై మాట్లాడటం లేదు. జగన్ సర్కార్ను పొగడటంలో ముందుండే.. ఐజేయూ నేత శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్లు… దీన్ని తప్పు పట్టక తప్పని పరిస్థితుల్లో తప్పు పడుతున్నారు. కానీ జర్నలిస్టుల కోసం తాము పోరాడుతున్నామనిచెప్పుకోవడానికే అన్నట్లుగా ఆ ప్రకటనలు ఉన్నాయి. దేవులపల్లి అమర్ సహా అందరిదీ అదే బాట. జర్నలిస్టులకు ఎలాంటి సంక్షే్మం అందించకుండా… నాన్చుతూ.. పోతున్నా.. ఎవరూ పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. జర్నలిస్టు సంఘాల పేరుతో ఆయా సంఘాల నేతలు మాత్రం ప్రభుత్వం వద్ద నుంచి లబ్ది పొందుతున్నారు. వారు మాత్రం బాగుపడుతున్నారు.