2015లో మోదీ సర్కారు అమృత్ పథకాన్ని ప్రారంభించింది. పట్టణాల వారీగా ర్యాంకులు ఇవ్వడం ప్రారంభించింది. ఈ పోటీలో తామే మేటి అని తెలుగు రాష్ట్రాలు నిరూపించాయి. సులభతర వాణిజ్యం ర్యాంకుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన తెలుగు రాష్ట్రాలు.. ఇప్పుడు జీవన సౌలభ్య సూచి అంటే ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌లో కూడా ర్యాంకుల పంట పండించుకున్నాయి. అమృత్ పథకం కింద ఇచ్చే జీవన సౌలభ్య సూచీ- 2018లో దేశంలోనే అగ్రస్థానంలో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఒడిశా, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలు నిలిచినట్టు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వెల్లడించింది. అత్యంత నివాసయోగ్య నగరాల్లో కాకినాడ, విశాఖ,తిరుపతి, విజయవాడ గుర్తింపు పొందాయి. ఈ జాబితాలో తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లకు గుర్తింపు లభించింది.
పట్టణాల్లో నివసించేవారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా మౌలికవసతి కల్పన, రక్షిత మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల సౌకర్యం మెరుగుపరచాల్సి ఉంటుంది. ఈ మూడింటిలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్ చక్కని ఫలితాలు సాధించాయి. సులభతర జీవన సూచీ ర్యాంకులు ఇచ్చే క్రమంలో ఆయా పట్టణాలకు ఉన్న అవకాశాలు, సమస్యలు, బలం, బలహీనతలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నారు. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ – 2018లో తిరుపతి నాలుగో స్థానం పొందగా, విజయవాడ తొమ్మిదో ప్లేస్ లో నిలిచింది. ఇన్స్టిట్యూషనల్ అంటే వ్యవస్థాపక విభాగంలో తిరుపతి దేశంలోనే రెండో ర్యాంకు పొందింది. ఇక కరీంనగర్‌కు మూడో ర్యాంకు, హైదరాబాద్ నాలుగు, విజయవాడ తొమ్మిది, విశాఖ 10 ర్యాంకుల్లో నిలిచాయి.
సోషల్ విభాగంలో తిరుపతికి మొదటి స్థానం దక్కింది. విజయవాడ 8వ స్థానాన్ని దక్కించుకంది. ఎకనామిక్ విభాగంలో విజయవాడకు 9వ ర్యాంక్, ఫిజికల్ విభాగంలో తిరుపతికి ఆరో ర్యాంక్, విశాఖ 10 ర్యాంకు దక్కించుకున్నాయి. ఐదు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణల్లో తిరుపతికి తొలి ర్యాంక్, కరీంనగర్‌కి 2వ ర్యాంక్ వచ్చాయి.