తెలంగాణలో డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్లో జరగాల్సి ఉంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ సన్నాహాలు ప్రారంభించింది. గత వారమే అన్ని నియోజకవర్గాలకు రిటర్నింగ్ ఆఫీసర్లును నియమించింది. పార్లమెంట్ ఎన్నికల సన్నాహాలు అసెంబ్లీ ఎన్నికల తర్వాత చేస్తారు. కానీ ఏపీలో మాత్రం.. అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. ఏకంగా రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించేశారు.
డిసెంబర్ లో జరిగే తెలంగాణ ఎన్నికలకు రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించిన కొద్ది రోజుల్లోనే ఏపిలోనూ నియమించడం ఆసక్తికరంగా మారింది. లోపాయికారీగా ఎన్నికల సంఘం ఏపీలోనూ ఎన్నికల ఏర్పాట్లు చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. జగన్ రెడ్డి ముందస్తు ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ తో సంప్రదించారని.. గతంలో పవన్ కల్యాణ్ అరోపించారు. అందులో భాగంగానే ముసుగులో గుద్దులాటగా.. అధికారికంగా అసెంబ్లీని రద్దు చేయకుండానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేశారన్న అనుమానాలు మొదలయ్యాయి.
కేంద్ర ఎన్నికల సంఘం విశాఖలో సమావేశం నిర్వహించింది. ఓటర్ల జాబితా గురించి అని హైలెట్ అయింది కానీ.. ఎన్నికల సన్నద్దత గురించి ప్రధానంగా చర్చించారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి అక్రమాలు ఉండకూడదని ఆదేశించారు. ఈసీ ఈ విషయంలో పక్కాగా పని చేస్తే అభినందించాల్సిందే. కానీ .. లోపాయికారీ వ్యవహారాలతో ఎన్నికల ప్రిపరేషన్స్ ప్రారంభిస్తే మాత్రం నిజాయతీని అనుమానించాల్సిందేనన్న కామెంట్లు వినిపిస్తున్నాయి .సాధారణ ప్రక్రియలో భాగంగానే ఆర్వోలను నియమిస్తే పర్వాలేదు కానీ జగన్ రెడ్డి త్వరలో అసెంబ్లీని రద్దు చేస్తారని.. వెంటనే ఎన్నికలు పెట్టేందుకు ఇలాంటి పనులు చేసిందని తర్వాత తేలితే మాత్రం.. ఈసీ విశ్వసనయత గంగలో కలిసిపోతుంది. అది ఓ పార్టీకో… మరొకరికో చేసిన మేలు కాదు.. ప్రజాస్వామ్యానికి చేసే ద్రోహం.